భావొద్వేగానికి గురైన నరేందర్‍, వినయ్‍ భాస్కర్‍

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్​లో ఓడిపోయిన అధికార పార్టీ ఎమ్మెల్యేలను చూసి కార్యకర్తలు కన్నీరు పెట్టుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు కూడా బోరుమన్నారు. వరంగల్‍ తూర్పు, వరంగల్‍ పశ్చిమ స్థానాల్లో బీఆర్ఎస్​ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో సోమవారం ఉదయమే వారిని పరామర్శించేందుకు ఇండ్లు, ఆఫీసుల వద్దకు కార్యకర్తలు వచ్చారు. తూర్పు ఎమ్మెల్యే నరేందర్‍ వరంగల్‍ రాజశ్రీ గార్డెన్‍లో ప్రెస్‍మీట్‍ పెట్టి బయటకు వస్తుండగా మహిళా కార్యకర్తలు నరేందర్‍ దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. వారిని సముదాయించే క్రమంలో నరేందర్‍ సైతం భావోద్వేగానికి గురయ్యారు. వరంగల్‍ పశ్చిమంలో మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున వినయ్‍ భాస్కర్‍ వద్దకు వచ్చారు. ‘అన్నా.. మీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం’ అంటూ పట్టుకుని బోరున ఏడ్చారు. వినయ్‍ భాస్కర్‍ వారిని సముదాయిస్తూనే కంటతడి పెట్టారు.

అయ్యో..శేఖరన్నా...ఎంత పనైపాయే!

బోరున విలపించిన భువనగిరి మున్సిపల్ ​చైర్మన్​భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పైళ్ల శేఖర్ ​రెడ్డి ఓటమిని తట్టుకోలేక భువనగిరి మున్సిపల్ ​చైర్మన్ ​ఎనబోయిన ఆంజనేయులు బోరున విలపించారు. సోమవారం ఆ పార్టీ ఆఫీసుకు వచ్చిన శేఖర్​రెడ్డిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మున్సిపాలిటీలో ఎంతో అభివృద్ధి చేసినా ప్రజలు ఓట్లేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పలువురు మహిళలు, కార్యకర్తలు కూడా ఆయనతో కలిసి విలపించారు. ఓ కార్యకర్త శేఖర్​రెడ్డిని పట్టుకొని వదలకుండా ఏడ్వడంతో ఓదార్చాల్సి వచ్చింది.  

- యాదాద్రి, వెలుగు