పీసీసీ కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

పీసీసీ కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. శనివారం గాంధీ భవన్‌‌‌‌లో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్‌‌‌‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది కుట్టు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమానికి మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. అనంతరం మహేశ్ గౌడ్‌‌‌‌ మాట్లాడుతూ.. మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ పాలన సాగుతున్నదని చెప్పారు.

 మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ పాలనలో ఈ రాష్ట్రంలోని మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా 600 బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపారు. మహిళలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్‌‌‌‌‌‌‌‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి మహిళా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు.