న్యూఢిల్లీ, వెలుగు: పాత పద్ధతులను అనుసరించడం ద్వారా ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మారాలని, ఎన్నికల స్ట్రాటజీని మెరుగుపరచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ నేతల మధ్య ఐక్యత లేనందుకే ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి పట్ల ఆత్మపరిశీలన చేసుకునేందుకు గాను శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ అయింది.
సమావేశంలో పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సీడబ్ల్యూసీ మెంబర్లు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తాజా అంసెబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యం, క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. ఫేక్ ప్రచారాన్ని ఎదుర్కోవడానికి, క్యాంపెయిన్ మెరుగుపర్చుకోవడానికి మరింత మంచి మార్గాలను చూడాలన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఐకమత్యం లేకపోవడం, నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం విజయానికి అడ్డంకిగా మారాయన్నారు. అందుకే కచ్చితంగా క్రమశిక్షణ పాటించాలన్నారు. ఓటమి ఫలితాల నుంచి ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ..
లోక్‌సభ ఎన్నికల్లో సీట్లను గణనీయంగా పెంచుకోవడంతో పార్టీలో జోష్ వచ్చింది కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా లేవని ఖర్గే తెలిపారు. ‘‘నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే.. ఇండియా కూటమి రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ పనితీరు అంచనా కంటే తక్కువగా ఉంది. ఈ ఫలితాలతో తక్షణమే పాఠాలు నేర్చుకుని, బలహీనతలు, లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రిజల్ట్స్ పార్టీ నేతలందరికీ ఒక సందేశం” అని ఆయన చెప్పారు.