అసంతృప్తులపై..స్పెషల్​ ఫోకస్

  •     జోరుగా సాగుతోన్న పార్టీ ఫిరాయింపులు
  •     నియోజకవర్గంలో మారుతున్న ఇక్వేషన్​లు

మెదక్‌, చిన్నశంకరంపేట, వెలుగు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ నియోజకవర్గంలో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. టికెట్​ విషయంలో భంగపడిన ప్రధాన రాజకీయ పార్టీ లీడర్లు, సెకండ్​ క్యాడర్​ నాయకులు పార్టీలు మారుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి తమకు పోటీయే ఉండదని అధికార బీఆర్​ఎస్​ భావించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీఆర్‌‌ఎస్​టికెట్ ఆశించి భంగపడ్డ మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు​ కొడుకు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్వేషన్ లు మారాయి.

దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి గట్టి పోటీ ఎదురు కానుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌‌ఎస్.. మెదక్​నియోజకవర్గంలో కాంగ్రెస్​ను బలహీన పరిచే ప్లాన్ చేస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులందరిని తమవైపు తిప్పుకోవడంపై స్పెషల్​ ఫోకస్​పెట్టింది. 

బీఆర్‌‌ఎస్ నుంచి కాంగ్రెస్​లోకి

గతంలో బీఆర్‌‌ఎస్​లో ఉన్న  మైనంపల్లి రోహిత్ తండ్రి హన్మంతరావుతో కలిసి కాంగ్రెస్​లో చేరిన సంగతి తెలిసిందే. వీరితో పాటు బీఆర్‌‌ఎస్ అసంతృప్త నేతలైన రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్​ గంగా నరేందర్, చిన్నశంకరంపేట సర్పంచ్​ రాజిరెడ్డి, బీఆర్‌‌ఎస్​ యూత్ లీడర్,  అడ్వకేట్​ జీవన్​రావు,  పాపన్నపేట మండల పరిషత్​ అధ్యక్షురాలు చందన

ALSO READ :  అక్టోబర్8న బీఎల్ఎఫ్ ఫస్ట్ లిస్ట్

మండల బీఆర్​ఎస్​ మాజీ అధ్యక్షుడు ప్రశాంత్​ రెడ్డి,  కూచన్​పల్లి మాజీ సర్పంచ్​ శేరి మహేందర్​రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. మిగిలిన మండలాలకు చెందిన బీఆర్‌‌ఎస్​అసంతృప్త లీడర్లను కూడా కాంగ్రెస్​లోకి తీసుకొచ్చేందుకు మైనంపల్లి రోహిత్​వర్గం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్​ను వీడుతున్న నాయకులు 

మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్​లో​చేరిన వెంటనే బీఆర్‌‌ఎస్​ కాంగ్రెస్​ లీడర్లపై ఫోకస్​ పెట్టింది. ముందుగా కాంగ్రెస్​ టికెట్​ ఆశించి భంగపడ్డ డీసీసీ ప్రెసిడెంట్​ కంఠారెడ్డి తిరుపతి రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించింది. తర్వాత రామాయంపేట, నిజాంపేట మండలాల కాంగ్రెస్​ అధ్యక్షులు శ్యాంరెడ్డి, లింగంగౌడ్​, బీసీ సెల్​ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవులు, కిసాన్​సెల్​ రామాయంపేట మండల అధ్యక్షుడు సుధాకర్​రెడ్డి రాజీనామా చేశారు.

తాజాగా చిన్నశంకరంపేట మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు పోతరాజు రమణ, ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. ఇదిలా ఉండగా బుధవారం మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ పాపన్నపేట మండలంలో పర్యటించగా కాంగ్రెస్​, అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.