న్యూఢిల్లీ: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్ ప్రియాంకా గాంధీ గెలవబోతున్నారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సచిన్ పైలట్ అన్నారు. ప్రియాంక ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో రాహుల్‌కు అండగా ఉంటే, బీజేపీ, ఎన్డీయే నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం పీటీఐకి ఇంటర్య్వూలో సచిన్ పైలట్ మాట్లాడారు. ‘‘వయనాడ్‌లో ప్రియాంక గాంధీ చరిత్రాత్మక విజయం కోసం ఎదురుచూస్తున్నాం.
పార్టీ కోసం ఆమె చాలా ఏండ్లుగా పనిచేస్తున్నారు. రాహుల్, సోనియా, రాజీవ్ గాంధీ కోసం కూడా ఆమె ప్రచారం చేశారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు ప్రియాంక అంటే ఎవరో తెలుసు. కేరళలోని ప్రజలకే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రియాంక గురించి తెలుసు. పార్లమెంట్‌లో ఆమె ముఖ్యంగా మహిళలు, యువత గురించి గళమెత్తనున్నారు. రాహుల్‌తో ప్రియాంక చేరితే.. లోక్‌సభలో వన్ ప్లస్ వన్ 11 అవుతుంది. అంతేకాకుండా ఎన్డీయే గడ్డుకాలం ఎదుర్కోవడంతో పాటు నిద్ర లేని రాత్రులు గడపాల్సి ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఒక్క రోజులోనే సీఎం పదవిపై నిర్ణయం..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి గెలబోతున్నదని సచిన్ పైలట్ తెలిపారు. ఎంవీఏ కూటమి కలిసే ఉందని, ఒకవేళ కూటమి గెలిస్తే మెజార్టీకి అనుగుణంగా సీఎం పదవిపై నిర్ణయం ఉంటుందన్నారు. ఒకరోజుకు మించకుండా సీఎం పదవిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘‘మహారాష్ట్రలో మార్పు రావాలనే ఆకాంక్ష ఓటర్లలో కనిపిస్తోంది. ఎందుకంటే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్‌లో ప్రజలు ఆశించిన లబ్ధి జరగలేదు. జార్ఖండ్‌లో బీజేపీని నమ్మడం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది” అని పైలట్ అభిప్రాయపడ్డారు.