ఖమ్మం టౌన్, వెలుగు : అరాచక శక్తులను ఓడించి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలను కోరారు. మంగళవారం ఖమ్మం సిటీలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు, రోడ్డు షో, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ బెదిరింపులతోపాటు ప్రలోభాలకు గురిస్తోందని ఆరోపించారు.
వాటికి భయపడకుండా తెలంగాణ కల సాకారం చేసిన సోనియమ్మ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరనున్న మైనారిటీ యువకుడిని బైండోవర్ కేసు పేరుతో తీసుకెళ్లి దుర్భషలాడి, రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని బెదిరింపులకు పాల్పడంపై తుమ్మల తనయుడు యుగంధర్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలియగానే వన్ టౌన్ పీఎస్ కు తుమ్మల యుగంధర్, మైనారిటీ లీడర్లు వెళ్లారు. చట్టాన్ని అతిక్రమించి దుర్వినియోగం చేస్తే తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.
పార్టీలో పలువురి చేరిక..
సిటీలోని తుమ్మల క్యాంపు కార్యాలయంలో 28వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ గజ్జెల వెంకన్న, లక్ష్మి దంపతులతోపాటు పలువురు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రఘునాథ పాలెం మండలం మాజీ రైతు సమన్వయ కమిటీ మాజీ చైర్మన్, పాపటపల్లి గ్రామానికి చెందిన బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్ పార్టీలో చేరారు. బోడేపూడి ట్రస్ట్ వ్యవస్థాపకులు బోడేపూడి రాజా కాంగ్రెస్ పార్టీ లో తన అనుచరులతో కలిసి జాయిన్ అయ్యారు.
9వ డివిజన్ కార్పొరేటర్ నాగులు మీరా ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో చల్లమల సుమంత్, గుర్రం రాజేశ్, కొనకంచి రవితో సహా 300 వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెరువు బజార్, తుమ్మలగడ్డ ఏరియాలలో రోడ్డు షో నిర్వహించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్ట రాగమయి మర్యాదపూర్వకంగా తుమ్మలను కలిశారు.