పాల్వంచ, వెలుగు : కొత్తగూడెం అసెంబ్లీ సీటును సీపీఐకి కేటాయించడంపై కాంగ్రెస్ హైకమాండ్‌పై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం పాల్వంచలోని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ నివాసంలో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
దశాబ్ద కాలంగా పార్టీని వెన్నంటి ఉన్న ఎడవల్లి కృష్ణకు బీఫామ్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ తనకే బీఫామ్ ఇవ్వాలని, లేకపోతే తాను బుధవారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని హెచ్చరించారు. అనంతరం ఎడవల్లి నివాసం నుంచి నటరాజ్ సెంటర్ ర్యాలీ నిర్వహించారు.
పాల్వంచ రూరల్, వెలుగు : పొత్తుల పేరుతో కొత్తగూడెం సీటును ఎడవల్లి కృష్ణకు కేటాయించకుండా సీపీఐకి ఇవ్వడం సరైంది కాదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గద్దల రమేశ్అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వాళ్లను హైకమాండ్ పట్టిచుకోకపోడం సరికాదని, ఈ విషయంలో పునరాలోచించాలని కోరారు.