- అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు చోట్ల హస్తం హవా
- లెఫ్ట్ మద్దతుతో మరింత బలం
- డీలా పడిన బీఆర్ఎస్ నేతలు
- బీజేపీ ప్రభావం అంతంతే!
మహబూబాబాద్, వెలుగు : మానుకోటలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. లోక్‌సభ టికెట్ దక్కితే చాలు గెలుపు ఖాయమన్న అభిప్రాయం ఉంది. దీంతో ఆ పార్టీ టికెట్ కోసం ఏకంగా 48 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఆరు చోట్ల కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచింది. కేవలం భద్రాచలంలో మాత్రమే స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్‌కు 2,93,445ఓట్లు ఎక్కువ వచ్చాయి. దీంతో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీ, హైదరాబాద్‌కు చక్కర్లు కొడుతున్నారు.
ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు బీఆర్ఎస్
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. 2009లో కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్ గెలిచారు. తొలిసారి గెలిచిన ఆయన అప్పట్లో కేంద్ర సామాజిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్అభ్యర్థులు గెలిచారు. 2014లో ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, 2019లో మాలోత్ కవిత కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్‌పై గెలుపొందారు.
కాంగ్రెస్‌లో ఆశావహుల జోరు
ప్రస్తుతం మాహబూబాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. రెండుసార్లు ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తిరిగి టికెట్ ఆశిస్తున్నారు. తనకు హైకమాండ్ ఆశీస్సులున్నాయని చెప్పుకుంటున్నారు. బలరాంనాయక్ రెండుసార్లు ఓడిపోయినా పార్టీలో కొనసాగుతూ అధిష్ఠానానికి విధేయుడిగా ఉన్నారు. ఢిల్లీ, రాష్ట్ర నేతలతో సత్ససంబంధాలున్న ఆయన ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. హైకమాండ్ నుంచి సానుకూల సంకేతాలుండడంవల్లే క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
డోర్నకల్ అసెంబ్లీ టికెట్ఆశించి భంగపడ్డ మాలోతు నెహ్రు నాయక్ సైతం ఎంపీ టికెట్ కోసంపోటీ పడగా ఆయనను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌గా నియమించారు. కొత్తగూడెంకు చెందిన శంకర్‌నాయక్ , ఆదివాసీ జాతీయ కాంగ్రెస్ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, మంత్రి పొంగులేటి ఫాలోవర్ విజయబాయి, రిటైర్డ్ఎక్సైజ్ ఆఫీసర్ బానోతు మోహన్‌లాల్, టీపీసీసీ సభ్యులు డాక్టర్లకావత్ లక్ష్మీనారాయణ, కిసాన్ పరివార్ నిర్వాహకుడు భూపాల్ నాయక్, పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో లెఫ్ట్‌పార్టీలకు కూడా చెప్పుకోదగ్గ బలం ఉంది. మహబూబాబాద్, భద్రాచలం, కొత్తగూడెం సెగ్మెంట్లలో వామపక్షాలకు ఓటుబ్యాంకు ఉంటుంది. జాతీయ స్థాయిలో లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమిలో ఉండడంతో కాంగ్రెస్‌కు కలిసివచ్చే అవకాశముంది.
బీజేపీ ప్రభావం అంతంతే..
మహబూబాబాద్‌లో బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించడంలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే కీలకంగా ఉంటాయని, మానుకోటలోనూ మంచి ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక్కడ నుంచి బీజేపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ నాయక్, మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రవీంద్ర నాయక్, సుంచు రామకృష్ణ, స్వరూప, భూక్య సంగీత, విజయలక్ష్మి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
బీఆర్ఎస్లో కనిపించని జోష్
బీఆర్ఎస్ నుంచి తిరిగి తానే పోటీ చేస్తానని సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత ప్రకటించారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు చాలామంది బీఆర్ఎస్ నేతలు ముందుకు రాగా, ఈసారి ఆ పరిస్థితి కనిపించడంలేదు. అసెంబ్లీ ఫలితాలతో బీఆర్ఎస్లో జోష్ తగ్గింది. కిందిస్థాయి నేతలు కూడా పూర్తిగా డీలా పడ్డారు. మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటమికి దారితీసిన కారణాలపై సమీక్ష కూడా జరగలేదు.