ఓటుకు ‘ఆన్​లైన్’ నోటు!.. నిఘా పెరగడంతో లీడర్ల కొత్త ఎత్తుగడ

  • ఎన్నికల డబ్బు ఇప్పటికే సెకండ్​ క్యాడర్​ దగ్గరికి!
  • ఓటర్లకు ఫోన్​పే, గూగుల్​పే చేసే ఏర్పాట్లు
  • గతంలోనే ఫోన్​ నంబర్లు సేకరించడంతో ఈజీ కానున్న ప్రాసెస్​
  • ఆన్​లైన్​ లావాదేవీలపైనా దృష్టి పెడ్తేనే తాయిలాలకు చెక్​

యాదాద్రి, వెలుగు : ఎలక్షన్​ కోడ్ అమల్లోకి రాగానే చెక్​పోస్టుల ఏర్పాటు, సర్వైలెన్స్​టీమ్స్​రంగంలోకి దిగడంతో లీడర్లపై నిఘా పెరిగిపోయింది. రూ.50వేలకు మించి నగదు డ్రా చేయడం, తరలించడం కష్టంగా మారుతోంది. దీంతో ఓటర్లకు పైసలు పంచేందుకు లీడర్లు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఎన్నికల డబ్బును ఇప్పటికే తమ అనుచరులు, సెకండ్​క్యాడర్​ లీడర్లకు చేరవేసిన లీడర్లు వారి ద్వారా పోలింగ్​కు ముందు ఓటర్లకు పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నారు. 

కొన్ని నియోజకవర్గాల్లో అధికారపార్టీ లీడర్లు ప్రయోగాత్మకంగా ఇప్పటికే గ్రామైక్య సంఘాల మహిళలకు రూ.వెయ్యి చొప్పున ఆన్​లైన్​ పేమెంట్​చేసినట్లు చర్చ జరుగుతోంది. 

నేతల దగ్గర రెడీగా ఓటర్ల ఫోన్​నంబర్లు..

ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు, ముఖ్యంగా రూలింగ్​పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక టీమ్​లను ఏర్పాటుచేసి సర్వేల పేరుతో నియోజకవర్గాల్లో ఇల్లిల్లూ చుట్టివచ్చారు. ఆయా ఇండ్లలో ఎంతమంది ఉంటారు? ఎందరికి ఓటు హక్కు ఉంది?  ఏయే స్కీములు అందుతున్నాయి? ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? లాంటి వివరాలతోపాటు ఫోన్​నంబర్లు సేకరించి వచ్చారు. వివరాలు తీసుకోవడం వరకు ఓకేగానీ ఫోన్​నంబర్లు ఎందుకు సేకరిస్తున్నారు? అనే విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆ వివరాలు, ఫోన్​నంబర్ల ఆధారంగానే తాయిలాలకు క్యాండిడేట్లు రెడీ అవుతున్నారు.

అనుచరులకు చేరిన డబ్బు.. 

ఎన్నికల కోడ్​వస్తే డబ్బు పంపిణీ కష్టమని భావించిన క్యాండేట్లు ఇప్పటికే మండలాలు, గ్రామాలు, వార్డులవారీగా తమ అనుచరులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు, పార్టీ లీడర్లలో తమకు నమ్మకస్థులైన వారికి ఇప్పటికే దశలవారీగా డబ్బు చేరవేసినట్లు తెలిసింది. ఆయా ఏరియాల్లో ఓటర్ల సంఖ్య ఆధారంగా వీరికి ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించి ఆ మొత్తాన్ని ఈసీ టీమ్​లు గుర్తు పట్టని రీతిలో ఓటర్లకు ఎలా చేరవేయాలో కూడా వివరించినట్లు తెలుస్తోంది. 

ఆయా ఇన్​చార్జిలు రూ.50వేలకు మించకుండా అమౌంట్​ను తమ కిందివాళ్లకు ట్రాన్స్​ఫర్​ చేసి,  అటుపై ఫోన్​పే, గూగుల్​పే ద్వారా ఓటర్లకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల చొప్పున పంచేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రంగం సిద్ధం చేసినట్లు రూలింగ్​పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కులసంఘాలు బలంగా  ఉన్న చోట కుల పెద్దలకు చేరవేసి, వారి ద్వారా డైరెక్ట్​ క్యాష్​ పంపించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు చెప్తున్నారు. నిజానికి హుజూరాబాద్​,  మునుగోడు ఉప ఎన్నికల తర్వాత ఓటర్లకు ఆన్​లైన్​లో చెల్లింపులు చేయడం పెరిగింది. 

ఆయా ఎన్నికల్లో  లిక్కర్ కంటే డబ్బే ఎక్కువ ప్రవహించిందనే టాక్​ నడిచింది. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్​ విడుదల కావడంతో కలెక్టరేట్లలో కంట్రోల్​ రూంలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి మూడు చొప్పున స్టాటిస్టికల్ , సర్వైవల్ టీమ్స్​ తో పాటు ప్లయింగ్​ స్క్వాడ్స్​ రంగంలోకి దిగాయి. చెక్​పోస్టులు ఏర్పాటయ్యాయి. కానీ ఈ టీమ్​లు, చెక్​పోస్టులు మైక్రోలెవల్​లో ఫోన్​ పే, గూగుల్​ పే ద్వారా జరిగే నగదు పంపిణీని ఎంతవరకు ఆపుతాయన్నది చర్చనీయాంశంగా మారింది.