కేసీఆర్‌‌‌‌ సభ సక్సెస్ చేయాలి

నల్గొండ, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, హుజూర్‌‌‌‌ నగర్‌‌‌‌, కోదాడ, వెలుగు: ఈ నెల 13న నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సభను సక్సెస్‌‌ చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. శనివారం  ఆలేరులో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్య గౌడ్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,  కోదాడలో ఎమ్మెల్సీ రవీందర్‌‌ రావు, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌, హుజూర్‌‌నగర్‌‌‌‌లో మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, అసెంబ్లీ ఇన్‌‌చార్జి చంటి క్రాంతి కిరణ్‌‌తో కలిసి చలో నల్గొండ పోస్టర్ ఆవిష్కరించారు.  

నల్గొండలో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, చౌటుప్పల్‌‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సభ ఇన్‌‌చార్జి శ్రీధర్‌‌‌‌తో కలిసి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు.  

ఈ చర్యతో మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు ఏడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులను  ప్రభుత్వం కేఆర్ఎంబీకి ధారాదత్తం చేసిన విషయాన్ని బీఆర్ఎస్ బట్టబయలు చేస్తే.. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సంతకాలు చేయలేదంటూ సీఎం, మంత్రులు ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం కేసీఆర్‌‌‌‌ చేపట్టబోయే పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.