- ఆదిలాబాద్, నిర్మల్ సెగ్మెంట్లో మరోసారి బరిలో ఆ నలుగురు
- ఎన్నిసార్లు ఓడినా పట్టు విడవకుండా పోటీకి సై
- ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న అభ్యర్థులు
ఆదిలాబాద్, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న లీడర్లు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వరుసగా ఓటమి పాలవుతున్నా ఈసారైనా గెలుస్తామనే ధీమాతో బరిలో నిలుస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ నియోజకవర్గాల్లో గత నాలుగు దఫాలుగా ఆ నలుగురు లీడర్లు ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ లో జోగు రామన్న, పాయల్ శంకర్ ఈసారి కూడా పోటీలో నిలిచారు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలను వేడుకుంటున్నారు.
నాలుగోసారి ప్రత్యర్థులుగా..
ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ నాలుగోసారి ప్రత్యర్థులుగా అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్నారు. జోగు రామన్న మొదటిసారి 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన ఆయన ఆ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2012 టీడీపీ నుంచి పాయల్ శంకర్ మొదటసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు జోగు రామన్న బీఆర్ఎస్ నుంచి, పాయల్ శంకర్ బీజేపీ నుంచి ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. వరుసగా 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన రామన్నపై ఈసారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో పాయల్ శంకర్ తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు.
నెరవేరని పాయల్ శంకర్, అనిల్ జాదవ్ కల
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు చెందిన ఆ ఇద్దరు నేతలు ఒక్క అవకాశం కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచి ప్రజల్లోకి వెళ్లాలని తాపత్రయపడుతున్నారు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ 2012 బై ఎలక్షన్ నుంచి వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. ప్రస్తుతం నాలుగోసారి పోటీ చేస్తున్నారు. 15 ఏండ్లుగా ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉన్నానని, ఈ సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు.
ఇక బోథ్ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ వరుసగా నాలుగోసారి అసెంబ్లీ బరిలో నిలిచారు. 2009, 2014 కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్.. 2018లో ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో బీఎస్పీ నుంచి బరిలో దిగి ఓడిపోయారు. ఇలా వరుసగా మూడు సార్లు ఓడిన ఆయన ఈసారి అధికారి పార్టీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ గెలుపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి సోయం బాపురావు పోటీలో ఉండడంతో ఎవరు గెలుస్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిర్మల్లో ఇద్దరి మధ్య పోటీ
నిర్మల్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో బీఎస్పీ, 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన మహేశ్వర్ రెడ్డిపై గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాధాన ప్రత్యర్థులుగా నాలుగోసారి బరిలో నిలిచారు. ఈ సారి కూడా వీరి మధ్య టఫ్ ఫైట్నడవనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు కోసం ఇద్దరూ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ALSO READ : రెండుసార్లు అధికారం ఇచ్చినా..కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలేదు : రేవంత్రెడ్డి