- కేసీఆర్ పోటీ చేసిన కామారెడ్డిలోనే అధికం
- కాంగ్రెస్‌లో ముమ్మరంగా చేరికలు
కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి లీడర్లు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ కోల్పోతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కామారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా పార్టీ మారుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రారంభం నుంచే చేరికలు షురూ కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో మరింత ఎక్కువయ్యాయి. గులాబీ పార్టీకి కంచుకోట అయిన గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్పోటీ చేశారు.
ఎన్నికల టైమ్‌లో కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ఇన్చార్జిగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ వ్యవహరించారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసి, కేసీఆర్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, లీడర్లు, కౌన్సిలర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, కౌన్సిలర్లు, భిక్కనూరు ఎంపీపీ గాల్‌రెడ్డి, దోమకొండ జడ్పీటీసీ తిర్మల్గౌడ్తో పాటు పలువురు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పారు.
స్వయంగా పార్టీ అధినేత పోటీ చేసినా కామారెడ్డిలో పార్టీ విజయం సాధించకపోవడంతో నారాజ్‌గా ఉన్న క్యాడర్హస్తం గూటికి చేరుతున్నారు. కామారెడ్డి టౌన్‌తో పాటు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల మాచారెడ్డి సింగిల్ విండోకు చెందిన 8 మంది డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ఎన్నికల నేపథ్యంలో పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సైతం చేరికలను ప్రోత్సహిస్తోంది.
మున్సిపాలిటీపై పట్టుబిగిస్తున్న హస్తం
కామారెడ్డి మున్సిపాలిటీపై హస్తం పట్టు బిగిస్తోంది. టౌన్‌కు చెందిన చాలామంది బీఆర్ఎస్ లీడర్లతో పాటు ఆ పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్లు హస్తం గూటికి చేరుతున్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 23 చోట్ల బీఆర్ఎస్, 8 స్థానాల్లో బీజేపీ, 12 ప్లేస్‌లలో కాంగ్రెస్, ఆరు చోట్ల ఇండిపెండెంట్లు విజయం సాధించారు. ఆరుగురి ఇండిపెండెట్లు సైతం బీఆర్ఎస్లో చేరగా ఆ పార్టీ చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ పదవులను దక్కించుకుంది.
ALSO READ : ఎస్టీపీపీ విస్తరణపై ఆశలు.. 800 మెగావాట్ల మూడో యూనిట్‌కు త్వరలోనే టెండర్లు
ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్లోకి వెళ్లారు. మున్సిపాలిటీలో ఆ పార్టీ తిరుగులేకుండా హవా కొనసాగించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణలు మారుతున్నాయి. పార్టీని వీడిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ఘర్‌వాపసీ కాగా, బీఆర్ఎస్ కౌన్సిలర్లు సైతం కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ బలం 24కు చేరింది. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలంటే 36 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. మరి కొందరు కౌన్సిలర్లు పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని హస్తం లీడర్లు పేర్కొంటున్నారు.
క్యాడర్లో అయోమయం
అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లోనే బీఆర్ఎస్లో విభేదాలు బయటపడ్డాయి. కేసీఆర్ ఓటమి తర్వాత కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఎవరనే విషయమై అధిష్టానం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. ఓటమిపై కూడా రివ్యూ చేయలేదని లీడర్లు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో తమ భవిష్యత్తు ఏమిటని క్యాడర్ అయోమయంలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు గులాబీ లీడర్లు కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు లీడర్లు కొద్దిరోజుల కింద మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి నియోజకవర్గ ఇన్చార్జిపై చర్చించినట్లు తెలుస్తోంది.