- అది బీజేపీ లక్షణం: కర్నాటక సీఎం సిద్ధరామయ్య
- నాపై, రాహుల్‌గాంధీ, డీకే శివకుమార్‌పై కేసులు పెట్టారని ఫైర్
మైసూరు: తాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ.. కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడలేదని, భవిష్యత్తులోనూ అలా చేయబోమని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. బీజేపీ మాత్రమే అలాంటి పనులకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. పోక్సో కేసులో మాజీ సీఎం బీఎస్ యడియూరప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ, జేడీ(ఎస్) ఆరోపించాయి. ఈ నేపథ్యంలో శనివారం సిద్ధరామయ్య మైసూరులో మీడియాతో మాట్లాడారు.
కక్షసాధింపు, వేధింపుల రాజకీయాలు బీజేపీ లక్షణం అని.. ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్, సీబీఐ దాడుల పేరుతో వేధించడం వారు మొదటి నుంచి చేస్తున్నారని అందుకే ప్రజలు ఈ సారి వారికి మెజారిటీ ఇవ్వలేదన్నారు. ‘‘వాళ్లు టార్గెట్ చేసి మరి నా మీద, డీకే శివకుమార్, రాహుల్ గాంధీపై కేసులు పెట్టారు. దాన్ని ఏమని పిలవాలి. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపారు. వీటిని ద్వేషపూరిత రాజకీయాలంటారా, ప్రేమ రాజకీయాలంటారా.. కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడేది బీజేపీ.. మేం ఎప్పటికీ అలాంటివి చేయం.. నేను ఇప్పటి వరకు చేయలేదు. నేను నిన్ననో, ఈయ్యాల్నో రాజకీయాల్లోకి రాలేదు. నా గతాన్ని పరిశీలించండి” అని అన్నారు.