కవిత బెయిల్​తో బీజేపీకి సంబంధం లేదు

కవిత బెయిల్​తో బీజేపీకి సంబంధం లేదు
  • బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప తెలిపారు. మంగళవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చిందని, దీన్ని కాంగ్రెస్ రాజకీయం చేస్తూ బీజేపీపై రుద్దే ప్రయత్నం చేయొద్దని చెప్పారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే అధికార పార్టీ మేనేజ్ చేయడం సాధ్యమా అంటూ ప్రశ్నించారు. అలాంటి మాటలు మాట్లాడే ముందు వారంతా రాజ్యాంగం చదువుకోవాలని సూచించారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ పుస్తకాన్ని జేబులో పెట్టుకొని తిరగడం కాదనీ... దాన్ని చదివితే దాంట్లో ఏముందో తెలుస్తుందన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అబద్దపు ప్రచారాలతో కాంగ్రెస్ విజయం సాధించిందని, అబద్దపు ప్రచారాలు, మోసపు మాటలు ఎక్కువ కాలం చెల్లవని స్పష్టం చేశారు.

ఆప్ పార్టీకి చెందిన మనీశ్ సుసోడియాకు బెయిల్ వస్తే ఆ పార్టీ బీజేపీతో కలిసినట్టేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులే అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించిన అభిషేక్ సింఘ్వీ ఎవరని.. ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల దోస్తీతోనే కవితకు బెయిల్ వచ్చిందని, కేసీఆర్ మద్దుతుతోనే అభిషేక్ సింఘ్వీ రాజ్యసభ ఎంపీ అయ్యారని సంగప్ప పేర్కొన్నారు.