ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయండి: సోనియాగాంధీ సూచన

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయండి: సోనియాగాంధీ సూచన
  • రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ సూచనలు 
  • పార్లమెంట్ లో అగ్రనేతలు సోనియా, రాహుల్​ను
  • కలిసిన పీసీసీ చీఫ్​ మహేశ్​ నేతృత్వంలోని బృందం

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర కాంగ్రెస్​ నేతలకు ఆ పార్టీ అగ్రనేత  సోనియా గాంధీ  దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ కు వెన్నంటే ఉన్నారని, వారి అభ్యున్నతికి  మరిన్ని ఆలోచనలు చేయాలని సూచించారు.   బీసీ రిజర్వేషన్లు బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు లు తెస్తాయని అన్నారు. 

మరింత కష్టపడాలని, అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల నేతృత్వంలో జరిగిన ‘బీసీల పోరుగర్జన’లో పాల్గొనేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం పార్లమెంట్ లో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. 

ఈ బృందంలో  మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్, ఎంపీలు కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, కావ్య, అనిల్, ఇతరులు ఉన్నారు. తొలుత సోనియా గాంధీని కలిసి.. 42 శాతం రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలను సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించారు.

 అనంతరం సంవిధాన్ భవన్ ప్రాంగణంలో రాహుల్ గాంధీని నేతలు కలిశారు.  తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ వేదికగా చేసిన పోరాటాన్ని  ఆయనకు వివరించారు.  కాగా, తాను కూడా బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ లో బలంగా కొట్లాడుతానని  రాష్ట్ర నేతలకు రాహుల్​ తెలిపారు.