ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అడ్డుకున్న పార్టీ కార్యకర్తలు

చండూరు, వెలుగు: టీఆర్‌‌ఎస్‌‌ అభ్యర్థి కూసుకుంట్ల తరఫున చండూరులో మంగళవారం ప్రచారం చేస్తున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్‌‌ రోహిత్‌‌ రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. ఉప ఎన్నికలో భాగంగా రోహిత్‌‌రెడ్డిని చండూరు మండలం ఉడతలపల్లి ఇన్‌‌చార్జిగా నియమించారు. కానీ, ఆయన మంగళవారం చండూరులో ప్రచారం చేసేందుకు వచ్చారు.

దీంతో లోకల్‌‌ లీడర్లు ‘మీకు ఉడతలపల్లి ఇచ్చారు కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ మేం ప్రచారం చేసుకుంటాం, మీరు వెళ్లిపోండి’ అని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లడంతో ఎమ్మెల్యే అనుచరులు పంపించి వేశారు. మరికొందరు స్థానిక లీడర్లు అక్కడికి వచ్చి లోకల్‌‌ కార్యకర్తలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.రోహిత్​రెడ్డి కూడా ప్రచారం ఆపేసి వెళ్లిపోయారు.