హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇక మీదట పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడడం కాంగ్రెస్ తరం కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు, రాజ్యాంగబద్ధంగా చేసిన చట్టాల నుంచి వాళ్లు తప్పించుకోలేరన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి అసెంబ్లీ స్పీకర్‌కి ఇంకా ఎన్ని నెలలు కావాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తెలంగాణలో మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్ తో జత చేసింది. వీటిని ఈ నెల 10న విచారిస్తామని తెలిపింది. కారు గుర్తుపై గెలిచి పార్టీలు ఫిరాయించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలంటూ కేటీఆర్ ఇటీవల పిటిషన్ వేశారు.