నిరుడు బీఆర్ఎస్​కు గడ్డుకాలం

  • కాంగ్రెస్ హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినం: కేటీఆర్
  • రసమయి తీసిన షార్ట్​ఫిల్మ్​ను వీక్షించిన కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: పోయినేడాది బీఆర్ఎస్​కు అత్యంత గడ్డుకాలమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. ఉద్యమాల నుంచి పుట్టి తెలంగాణ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్​ పార్టీ అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ ​పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలతో ప్రజలు మోసపోయారని, దీంతో తృటిలో ఓడిపోయామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 1.8 శాతమేనని చెప్పారు. అసెంబ్లీ ఫలితాల తర్వాత కేసీఆర్ తుంటి ఎముక విరిగి కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారని, అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని తెలిపారు. 

పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే కవితను అరెస్ట్​చేసి జైల్లో పెట్టారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఘోరమైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఆ తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్​లో చేరారని పేర్కొన్నారు. 

ఇన్ని దెబ్బలు తగిలినా ఉద్యమ పార్టీ కనుక తట్టుకుని నిలబడగలిగిందని చెప్పారు. వేరే పార్టీ అయితే బిచాణా ఎత్తేసేదన్నారు. శనివారం తెలంగాణభవన్​లో రసమయి బాలకిషన్ రూపొందించిన ‘నమ్మి నానబోస్తే’ అనే షార్ట్​ఫిల్మ్​ను రిలీజ్ చేసి వీక్షించారు. తర్వాత కేటీఆర్ మాట్లాడారు. మొన్నటి ఎన్నికల్లో పోయింది అధికారమేనని, ప్రజల కోసం పోరాడే లక్షణం కాదని చెప్పారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అంతే నిబద్ధతతో ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు.

గాంధీభవన్ బోసి పోయింది

ఏ ప్రభుత్వమూ మూటగట్టుకోనంత వ్యతిరేకతను కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోనే మూటగట్టుకున్నదని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వ పాలనపై ఇటీవలే ఓ సంస్థ సర్వే చేసిందని, ప్రభుత్వంపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆ సర్వేలో తేలిందని చెప్పారు. దీంతో ప్రజలు గాంధీభవన్​కు వెళ్లడం లేదన్నారు. 

సమస్యలను చెప్పుకోవడానికి తెలంగాణభవన్​కు వస్తున్నారని చెప్పారు. దీంతో గాంధీభవన్ బోసిపోయి తెలంగాణ భవన్​ కళకళలాడుతున్నదని అన్నారు. రసమయి బాలకిషన్​ నిర్మించిన షార్ట్​ఫిలిం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందని చెప్పారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయి గోసపడుతున్న తెలంగాణ సమాజం తీరును కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు.

కేటీఆర్​తో సర్పంచులు, లగచర్ల మహిళల భేటీ

లగచర్ల దాడి ఘటనలో నిందితుల కుటుంబ సభ్యులు, రాజన్నసిరిసిల్ల జిల్లా సర్పంచులు, మాజీ సర్పంచులు కేటీఆర్​తో తెలంగాణభవన్​లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. లగచర్లలో భూసేకరణ రద్దయ్యేదాకా పోరాటం చేస్తామని చెప్పారు. గిరిజనులపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.