- డిప్యూటీ సీఎం భట్టికి ఎస్టీయూ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్ రెడ్డి, సదానందం గౌడ్ కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్కను సంఘం నేతలతో పాటు కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2022 జులై నుంచి నాలుగు విడతల 14.56 శాతం డీఏ మంజూరు చేయాల్సి ఉందని చెప్పారు.
దీంతో పాటు ఉద్యోగుల వేతన, ఇతర సప్లిమెంటరీ బిల్లులు ఈ– కుబేరులో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఉద్యోగుల జీతం నుంచి మినహాయించిన జీపీఎఫ్ నుంచి అడ్వాన్సులు, పాక్షిక చెల్లింపుల బిల్లులు సైతం నెలల తరబడి పెండింగ్ పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో కూడా కరువు భత్యం ప్రకటించేలా శాశ్వత విధానం తీసుకొచ్చి, మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలని కోరారు.