ఏటూరునాగారం, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ను వెంటనే అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్ రెడ్డి కోరారు. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) ములుగు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక కార్యకర్తలకు సర్వీస్, లీవ్ రూల్స్, పెన్షన్ రూల్స్ పై జిల్లా స్థాయి శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పర్వత రెడ్డి మాట్లాడుతూ ఎస్టీయూ రాష్ట్రంలోని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాడుతుందన్నారు.
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ కోసం ప్రభుత్వం చొరవ తీసుకొని, ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలన్నారు. సమగ్ర శిక్ష పరిధిలోని ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తూ, రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య, అదనపు కార్యదర్శి ఏ.వీ. సుధాకర్, జిల్లా అధ్యక్షుడు శిరుప సతీశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఏళ్ల మధుసూదన్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.