ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమే!

-పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ కామెంట్

నల్లమల అడవుల్లో వజ్రాలు, బంగారం అన్వేషణ పేరుతో యురేనియం కార్పొరేషన్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది. యురేనియం తవ్వకాలు పర్యావరణానికి, జీవజాలానికి తీవ్ర ప్రమాదకరమని జనం ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి కేంద్రం కొత్తగా వజ్రాలు, బంగారం నిల్వలపై కట్టు కథలు చెబుతోంది. నల్లగొండ, కడప జిల్లాల్లో యురేనియం తవ్వకాల కోసం 20 ఏళ్ల నుంచి వివిధ రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి. వాటికి కొనసాగింపే ఈ అసత్య ప్రచారం.

ప్రజల ఆగ్రహానికి భయపడి యురేనియం సెర్చింగ్​ను నల్లగొండ జిల్లాలో టెంపరరీగా విరమించుకున్న సర్కారు.. కడప జిల్లా తుమ్మలపల్లిలో తవ్వకాలు మొదలుపెట్టి స్థానికుల జీవితాలతో, ప్రకృతితో చెలగాటమాడుతోంది. ఈ విషయంలో అక్కడి ప్రజలను ఎన్ని అబద్ధాలతో మభ్యపెట్టారో వాళ్లే చెబుతారు. తెలంగాణలోని పాలమూరు, గద్వాల,  నాగర్ కర్నూలు, వనపర్తి,  నల్లగొండ జిల్లాల్లో; ఆంధ్రప్రదేశ్​లోని కడప, కర్నూలు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వజ్రాల గనులు కొత్త కాదు.

కుతుబ్ షాహీ నవాబుల కాలంలో ఈ గోల్కొండ వజ్రాల గనులు లాభసాటిగానే నడిచినా సౌతాఫ్రికాలోని కింబర్లీ వజ్రాల పోటీని మార్కెట్ ధరల్లో తట్టుకోలేకపోయాయి. కింబర్లీతో పోల్చితే గోల్కొండ వజ్రాల తవ్వకం, పాలిషింగ్, గ్రైండింగ్ ఖర్చులు ఎక్కువ కావడంతో నిజాంల కాలంలోనే ఈ గనులు మూతపడ్డాయి. అమెరికా, బ్రిటన్​ గనుల సంస్థలు కూడా తవ్వకం, శుద్ధి ఖర్చులు లాభసాటి కాదని తెలిసి పదేళ్ల కిందట నల్లమల నుంచి వెళ్లిపోయాయి.

ఈ విదేశీ కంపెనీలన్నీ.. బిజినెస్​ పేరుతో 200 ఏళ్లు, వలస పాలనతో మరో 200 ఏళ్లు ఇండియాని నిలువునా దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ సంతతివే కావటం గమనార్హం. ఈ నిజాలు బయటపెట్టకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలు చెబుతూ యురేనియం కార్పొరేషన్ ప్రజలను మోసగిస్తోంది. ప్రకృతితో పరాచికాలాడాలని ప్రయత్నిస్తోంది. సూర్యాపేట జిల్లాలోనూ అన్వేషణ యురేనియం కోసమే కానీ బంగారం కోసం కాదనేది సుస్పష్టం. వజ్రాలు, బంగారం కోసమైతే నల్లమలలో వేల సంఖ్యలో బోరుబావుల తవ్వకం అవసరమే లేదు.

రైతులకు చెప్పకుండా వారి పొలాల్లో, కరెంట్​ సబ్ స్టేషన్లలో బోర్లు వేయటం; హెలికాఫ్టర్ల ద్వారా సర్వే చేయటం దండగ. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణంపై ఎఫెక్ట్​ పడుతుందని మాట వరసకైనా చెప్పట్లేదు. బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రతి విషయాన్నీ సీక్రెట్​గా ఉంచటం దురుద్దేశంకాక మరేంటి?. దీన్నిబట్టి ఈ సర్వేలన్నీ యురేనియం కోసమేనని తెలుస్తూనే ఉంది. యురేనియం తవ్వకాల కోసం ముందుచేతగా నల్లమల నుంచి చెంచులను, స్థానికులను తరలించడానికి గతంలో చేసిన ప్రయత్నాలు రాష్ట్ర విభజనతో ఆగిపోయాయి.

చిత్తూరు, అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో బంగారం మైనింగ్​కి, స్థానికులను తరలించటానికి వేసిన పన్నాగాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నిలిచిపోయాయి. ప్రజావ్యతిరేక విధానాలతో, ప్రకృతి విధ్వంసానికి సర్కార్లు బరితెగిస్తే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని మర్చిపోకూడదు. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే ఆ గనుల్లోనే భూస్థాపితమవుతాయని గుర్తుంచుకోవాలి.