జగిత్యాల జిల్లాలోని పాశీగామ, స్థభంపల్లి గ్రామస్తులు ముఖ్యమంత్రి కేసీఆర్కు పోస్ట్ కార్డులు రాశారు. జనావాసాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దంటూ పోస్ట్ కార్డుల ద్వారా నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయ మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో పాశీగామ, స్థభంపల్లి గ్రామస్తులు వెల్గటూర్లోని అంబేద్కర్ కూడలి వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు... ప్రాణాలే ముద్దు అంటూ జువ్వాడితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి విన్నవిస్తూ పోస్ట్ కార్డులతో ప్రజలు నిరసన చేపట్టారు.
కేసీఆర్ ఊరుకోం...
సీఎం కేసీఆర్కు పాశీగామ,స్థభంపల్లి గ్రామస్తులు, ధర్మపురి ఆలయ మాజీ చైర్మెన్ జువ్వాడి కృష్ణారావు దండం పెట్టారు. రెండు చేతులు జోడించి సీఎం కేసీఆర్కు దండం పెట్టి వేడుకుంటూ...ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. గాలి,నీరు,ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టే ఫ్యాక్టరీ కట్టవద్దని కోరారు. ఇథనాల్ పోరాటంలో రెండు గ్రామాల్లోని వ్యక్తులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఫ్యాక్టరీని కట్టాలని చూస్తే ప్రాణాలు అడ్డుపెట్టయినా సరే.. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.