
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి బీహార్లో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీఏ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ కూటమి నుంచి వైదొలిగింది. ఈ మేరకు ఆర్ఎల్జేపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి పశుపతి కుమార్ పరాస్ సోమవారం (ఏప్రిల్ 14) కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి నుంచి పూర్తిగా వైదొలుగుతున్నామని.. ఇకపై ఆ కూటమితో మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఆర్ఎల్జేపీ అంటేనే దళిత పార్టీ.. అలాంటి దళితులకు ఎన్డీఏ అన్యాయం చేసిందని.. అందుకే ఎన్డీఏతో సంబంధాలు తెంచుకున్నామని క్లారిటీ ఇచ్చారు. ‘‘2014 నుండి ఎన్డీఏలో ఉన్నాను. కానీ ఎన్డీఏ మా పార్టీకి అన్యాయం చేసింది. ఈ రోజు నుంచి నా పార్టీకి ఎన్డీఏతో ఎటువంటి సంబంధాలు ఉండవని ప్రకటిస్తున్నాను. దళిత పార్టీ అయిన ఆర్ఎల్జేపీకి ఎన్డీఏ అన్యాయం చేసింది. అందుకే ఆ కూటమి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాం ’’ అని పేర్కొన్నారు. బీహార్లో అధికార బీజేపీ, జేడీయూ పార్టీలు ఆర్ఎల్జేపీని ఒంటరిని చేశాయని విమర్శించారు.
కాగా, దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీలో చీలిక ఏర్పడిన విషయం తెలిసిందే. రామ్ విలాస్ పాశ్వాన్ మరణాంతరం ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ స్థాపించారు. రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడు పసుపతి కుమార్ పరాస్ రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఏర్పాటు చేశారు.
ఈ రెండు పార్టీలు ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతుండగా.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చిరాగ్ పాశ్వాన్ వైపు మొగ్గు చూపింది. దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న పశుపతి పరాస్.. తాజాగా ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశుపతి పరాస్ ఎన్డీఏ నుంచి తప్పుకోవడం రాష్ట్రంలో కూటమిపై కొంత ప్రభావం చూపుతోందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.