వినూత్న నిరసన...పాశిగామలో బోనాలు తీసిన గ్రామస్తులు

వెల్గటూర్, వెలుగు : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామలో నెలకొల్పనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోసం నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న గ్రామస్తులు గురువారం వినూత్నంగా మైసమ్మకు బోనాలు తీశారు. ఇథనాల్​ప్రాజెక్టు రద్దయ్యేలా చూడాలని మైసమ్మకు మొక్కుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరవుతారనే సమాచారంతో జగిత్యాల పోలీసులు ఆయనను ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు.

అలాగే, ధర్మపురిలో జగిత్యాల డీసీసీ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో గ్రామస్తులే ఊరు శివారు నుంచి బోనాలు నెత్తిన పెట్టుకొని ఇథనాల్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న మైసమ్మ తల్లికి సమర్పించారు. ఈ సందర్భంగా ఓ మహిళకు పూనకం వచ్చి ‘ఇక్కడ ప్రాజెక్టు పడితే గ్రామస్తులందరూ ఇబ్బందులు పడుతరు’ అని భవిష్యవాణి చెప్పింది.

ఈ క్రమంలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత గ్రామస్తులందరూ వంటలు వండుకొని భోజనాలు చేసి తిరిగి ఇండ్లకు వెళ్లారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు.