పోడు భూములకు పాస్ బుక్ లు రెడీ

  •     192.7 ఎకరాలకు ఓకే
  •     అప్లయ్​ చేసుకున్నది 2,130
  •     సూర్యాపేటలో 84 మందికి 89 ఎకరాలు
  •     అప్లయ్​ చేసుకున్నది 6700

యాదాద్రి/ సూర్యాపేట, వెలుగు: పోడు చేసుకునే గిరిజనులు, గిరిజనేతరులకు పట్టాలు ఇస్తామని ఏండ్లుగా చెబుతూ వచ్చిన సర్కారు.. చివరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసింది. అప్లయ్​ చేసుకున్నవారిలో యాదాద్రి జిల్లాలో కేవలం 10 శాతం మాత్రమే అర్హులుగా గుర్తించారు.  వేలాది ఎకరాల పోడులో వందల ఎకరాలకే ఆఫీసర్లు ఓకే చెప్పారు. కొందరికైతే గుంటల్లోనే పోడు భూమికి అర్హులుగా ఆఫీసర్లు తేల్చారు.

అర్హులు 209.. పాస్​ బుక్కులు186 

యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని పోడు భూములకు అప్లయ్​ చేసుకునోన్నళ్లలో అర్హులను ఆఫీసర్లు గుర్తించారు. జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్​ డివిజన్లలో 6,133 ఎకరాలకు 2,130 మంది అప్లయ్​ చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 6,700 మంది అప్లయ్​ చేసుకున్నారు. గ్రామాలవారీగా అప్లయ్​ చేసుకున్న రైతుల ఆధార్​ ఐడీలు తీసుకొని 2005 డిసెంబర్​13 నాటికి  సర్వే నెంబర్ల వారీగా ఎంత మేరకు పోడు సాగు చేస్తున్నారు? భూ విస్తీర్ణం ఎంత? నాలుగు వైపులా ఏయే రైతులు ఉన్నారనే వివరాలను సేకరించారు. గ్రామ, డివిజన్​, జిల్లా స్థాయిలో మీటింగుల్లో స్క్రీనింగ్​ ప్రక్రియ ముగించారు. 

యాదాద్రి జిల్లాలో 209 మంది

యాదాద్రి జిల్లాలో అప్లికేషన్​ చేసుకున్న వారిలో 209 మందిని అర్హులుగా గుర్తించారు.  వారికి కూడా తమ అప్లికేషన్లో పేర్కొన్న విస్తీర్ణానికి సంబంధించ పట్టాలు ఇవ్వడం లేదు. కేవలం 186 మందికి మాత్రమే పక్కా పత్రాలు ఇస్తునారు. 192.7 ఎకరాలకు  సంబంధించి పాస్​బుక్స్​ రెడీ చేశారు. మిగిలిన 23 మందికి వివిధ కారణాల వల్ల పాస్​బుక్స్​ రెడీ కాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. 

సూర్యాపేట జిల్లాలో 84 మంది

సూర్యాపేట జిల్లాలో కేవలం 84 మందినే అర్హులుగా గుర్తించి, వారికి 89 ఎకరాలు సాగు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అర్హుల్లో కొందరికి అరెకరాని కంటే తక్కువలోనే పోడు చేసుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. అయితే ఎస్టీలు కాకున్నా..  మూడు తరాలుగా పోడు చేస్తున్న వారు లేకపోవడంతో  అప్లికేషన్లు పెట్టుకున్నా నాన్​ ఎస్టీలకు పట్టాలు ఇవ్వడం లేదు. 

రూల్స్​ తెలియక

పోడు భూమి పొందడానికి హక్కుదారులైనప్పటికీ.. రూల్స్​ తెలియక అనర్హులై పోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోడు భూమి సాగులో మొదటి నుంచి ఉన్నవారినే అర్హులుగా గుర్తిస్తారు. చనిపోయినట్టయితే భార్య, లేకుంటే పెద్ద కొడుకును హక్కుదారుగా గుర్తిస్తారు. అయితే తండ్రి బతికి ఉన్నా.. అతడికి బదులు కొడుకులు అప్లయ్​ చేసుకున్నారు. దీంతో వారందరూ అనర్హులయ్యారు.  

నారాయణపురంలో ఎక్కువ

యాదాద్రి జిల్లాలోని నారాయణపురంలో పోడు భూముల లబ్ధిదారులు ఎక్కువ మందిని గుర్తించారు. గుర్తించిన 209 మందిలో 186 మందికి పాస్​బుక్స్​ రెడీ అయ్యాయి. వీరిలో 124 మంది నారాయణపురం మండలానికి చెందిన వారే ఉన్నారు. తుర్కపల్లి మండలానికి చెందిన 41, చౌటుప్పల్​ మండలానికి చెందిన 21 మంది లబ్ధిదారులుగా ఉన్నారు.