ఎటు చూసినా మృతదేహాలే .. ఆస్పత్రి ముందు భీతావహ పరిస్థితి

ఎటు చూసినా మృతదేహాలే .. ఆస్పత్రి ముందు భీతావహ పరిస్థితి

హత్రాస్: బాధితుల హాహాకారాలు.. బంధువుల రోదనలతో.. సికిందరరావు ట్రామా కేర్ సెంటర్ ఆవరణ భీతావహంగా మారింది. భోలే బాబా సత్సంగ్​ ఘటనలో బాధితులను తక్షణ సాయం కోసం ఈ ఆసుపత్రికే తరలించారు. కిందపడిపోయిన వారిని ఆంబులెన్స్ లు, ఆటోలు, ట్రాక్టర్లు, జీపులు.. ఇలా దొరికిన వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తీసుకొచ్చారు.

బాధితులలో ఎక్కువమంది చలనం లేకుండా పడి ఉన్నారు. వారిలో కొందరు స్పృహ తప్పిన వాళ్లు కాగా చాలా మంది అప్పటికే చనిపోయారు. వైద్యులు పరీక్షించి ప్రాణాలతో ఉన్న వారిని లోపలికి, మృతదేహాలను బయటకు పంపించారు. ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తూ భయానక వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులను, అయిన వాళ్లను కోల్పోయిన వాళ్ల రోదనలతో ఎటు చూసినా విషాదం నెలకొంది.

అందరూ చిన్నారులు మహిళలే..

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు చిన్నారులే ఉన్నారని అధికారులు చెప్పారు. స్పృహ కోల్పోయిన మహిళల, చిన్నారులు, గాయపడ్డ వారిని ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద నేలపైనే పడుకోబెట్టారు. ఆస్పత్రి చిన్నది కావడం, తగినన్ని వైద్య సదుపాయాలు, సిబ్బంది లేకపోవడంతో బాధితులకు చికిత్స అందడంలో ఆలస్యం జరిగింది. వాహనాల్లో తీసుకువచ్చిన మృతదేహాలలో తమ వాళ్ల బాడీలను  నేలకు దింపేందుకు కుటుంబ సభ్యులు సాయం చేశారు. పోస్ట్ మార్టం పూర్తయితే అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.