పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఓ ప్రయాణికున్ని బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్టు తెలుస్తోంది. దానికి కారణం అతను విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో చేసిన చేష్టలేనని తెలుస్తోంది. సెప్టెంబర్ 14 న జరిగిన ఈ ఘటన ప్రకారం పెషావర్- దుబాయ్ విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా సీట్లను కొట్టడం, విమానం కిటికీలను తన్నడం, విమాన సిబ్బందితో ఘర్షణకు దిగడం వంటి పనులకు ఒడిగట్టాడు. ఫ్లైట్ గాల్లో ఉండగానే PK-283 విమానంలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ తోనూ గొడవకు దిగాడు. ఈ సమయంలోనే విమానం కిటికీని పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా బలవంతంగా తన్నడం లాంటి పనులు చేశాడు.
అంతే కాదు విమానంలోని సీట్లను సైతం తన్నుతూ ఇతర ప్రయాణికులనూ ఇబ్బందులకు గురిచేశాడు. విమానం నేలపై తలను ఆనించి పడుకున్నాడు. ఈ నేపథ్యంలో అతన్ని కంట్రోల్ చేసే సమయంలో అతను వారిపైనా దాడికి దిగాడు. అయితే పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండేందుకు, విమానయాన చట్టానికి అనుగుణంగా ప్రయాణికుడిని అతని సీటుకు కట్టివేసినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఆ ప్రయాణికుడిని భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా PIA అధికారుల ప్రకారం ప్రయాణికుడిని విమానయాన సంస్థ బ్లాక్ లిస్ట్ చేసినట్టు సమాచారం.