విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుడికి గుండెపోటు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేసిన దక్కని ఫలితం

విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుడికి గుండెపోటు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ చేసిన దక్కని ఫలితం

న్యూఢిల్లీ: దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్‎తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. 

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే గుండెపోటుతో ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన ఇండిగో ఫ్లైట్‎లో సోమవారం (మార్చి 31) జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. అస్సాంలోని నల్బరికి చెందిన సతీష్ చంద్ర బర్మన్ ఇండిగో విమానంలో పాట్నా నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఫ్లైట్ మార్గ మధ్యలో ఉండగానే సతీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 

వెంటనే గమనించిన విమాన సిబ్బంది సతీష్ చంద్రకు ప్రాథమిక చికిత్స అందించింది. అయినప్పటికీ ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పైలెట్‎కు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని  లక్నోలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. వెంటనే అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ ఆరోగ్యం విషమించడంతో సతీష్ చంద్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సతీష్ మరణానికి గుండె పోటు కారణమని వైద్యులు వెల్లడించారు.