మద్యం మత్తులో మహిళ కండక్టర్ను కొట్టిన ప్రయాణికుడు

ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ సజ్జనార్  హెచ్చరించినా దాడులు ఆగడం లేదు. ఇటీవలే హైదరాబాద్ లో  ఓ మహిళా ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సు కండక్టర్ పై దాడి చేసింది. బస్సు కండక్టర్ ను చెప్పుతో కొట్టింది. అడిగిన చోట బస్సు ఆపలేదని ఆరోపిస్తూ కండక్టర్ ను విచక్షణారహితంగా బూతులు తిడుతూ.. చెప్పుతో కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఇదే ఘటన చోటు చేసుకుంది. 

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సులోనే రెచ్చిపోయాడు ఓ ప్రయాణికుడు. మహిళా కండక్టర్ పై దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా బూతులు తిడుతూ.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలా దాడులు చేయకూడదని చెప్పిన ప్రయాణికులపై వాగ్వాదానికి దిగాడు. ఎంత చెప్పినా వినక పోవడంతో.. ప్రయాణికులు కండక్టర్ కలసి అతన్ని  పోలీసులకు అప్పగించారు. కోరుట్ల నుంచి వేములవాడ వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది.