ఆటో అమ్మకాలు 9శాతం డౌన్... పేరుకుపోయిన స్టాక్​

ఆటో అమ్మకాలు 9శాతం డౌన్... పేరుకుపోయిన స్టాక్​
  • 19 శాతం తగ్గిన పీవీ సేల్స్​
  • వెల్లడించిన ఫాడా

న్యూఢిల్లీ: డిమాండ్ లేక ప్యాసింజర్ వెహికల్స్​ ఇన్వెంటరీ భారీగా పెరగడంతో సెప్టెంబరులో  ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు వార్షికంగా 9 శాతం క్షీణించాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) వెల్లడించింది. ఈ సమస్య పరిష్కారానికి  దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆటోమొబైల్​ కంపెనీలను కోరింది. ఫాడా రిపోర్ట్​ ప్రకారం..గత  సెప్టెంబరులో మొత్తం 18,99,192 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, ఈసారి సెప్టెంబరులో ఇవి 17,23,330 యూనిట్లకు తగ్గాయి. టూవీలర్లు సహా చాలా ప్యాసింజర్ వెహికల్స్ స్టాకు పేరుకుపోయింది.

గణేష్ చతుర్థి, ఓనమ్​ వంటి పండుగలు ప్రారంభమైనప్పటికీ, అమ్మకాలు పెరగలేదని డీలర్లు అంటున్నారని ఫాడా ప్రెసిడెంట్​ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. ప్యాసింజర్ వెహికల్స్​ విక్రయాలు గత నెలలో 3,39,543 యూనిట్ల నుంచి 19 శాతం తగ్గి 2,75,681 యూనిట్లకు పడిపోయాయి.   వినియోగదారుల సెంటిమెంట్ లేకపోవడంతో టూ-వీలర్ రిటైల్ విక్రయాలు వార్షికంగా 8 శాతం తగ్గి 12,04,259 యూనిట్లకు పడిపోయాయి. 

కమర్షియల్​ వెహికల్స్​ రిజిస్ట్రేషన్లు గత నెలలో 10 శాతం క్షీణించి 74,324 యూనిట్లకు చేరుకున్నాయి.  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తున్న ప్రాంతాలలో సానుకూల  వృద్ధి ఉన్నప్పటికీ, మిగతా ప్రాంతాల్లో డిమాండ్ బలహీనంగా ఉందని ఫాడా పేర్కొంది. గత  సెప్టెంబర్​లో 1,05,827 త్రీవీలర్లు అమ్ముడుపోగా, ఈసారి 1,06,524 యూనిట్లు అమ్ముడయ్యాయి.  ట్రాక్టర్ విక్రయాలు గత నెలలో 15 శాతం పెరిగి 74,324 యూనిట్లకు చేరుకున్నాయి. 

కంపెనీలు స్పందించాలి

పండుగల సీజన్‌‌‌‌ అమ్మకాలను పెంచడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని  ఒరిజినల్ ఎక్విప్‌‌‌‌మెంట్ తయారీదారులను (ఓఈఎం) కోరామని విఘ్నేశ్వర్​ చెప్పారు.   ఈ పండుగ సీజన్​లోనూ మొత్తం మార్కెట్ సెంటిమెంట్ తక్కువగా ఉందని, ఫ్లాట్ లేదా నెగెటివ్ వృద్ధి కనిపిస్తోందని అన్నారాయన.  ‘‘పిత్రపక్షం వంటి రోజుల్లో అమ్మకాలు ఉండవు. భారీ వర్షపాతం,  మందగించిన ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. డీలర్ల దగ్గర 80--–85 రోజుల ఇన్వెంటరీ ఉంది. వీటి విలువ రూ.79 కోట్లు ఉంటుంది. దాదాపు 7.9 లక్షల వెహికల్స్​కు సమానం" అని విఘ్నేశ్వర్ చెప్పారు.

అమ్ముడవని స్టాక్ కారణంగా డీలర్లు ఇబ్బంది పడుతున్నారని, వీరిపై బ్యాంకులు ఒత్తిడి తేకుండా చూడాలని ఫాడా ఆర్​బీఐని కోరింది. ఆలస్యం కాకముందే మార్కెట్ పునరుద్ధరణకు ఓఈఎంలు చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్​ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం   ఏప్రిల్–-సెప్టెంబర్ మధ్య మొత్తం రిటైల్ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1,11,83,734 యూనిట్ల నుంచి 7 శాతం వృద్ధితో 1,19,15,963 యూనిట్లకు పెరిగాయి.

ప్యాసింజర్ వెహికల్స్​ రిజిస్ట్రేషన్‌‌‌‌లు 1 శాతం పెరిగి 18,70,991 యూనిట్లకు చేరాయి.  టూవీలర్ల విక్రయాలు ఏడాదికి 9 శాతం పెరిగి 85,66,531కి చేరాయి. కమర్షియల్​ వెహికల్స్​ రిజిస్ట్రేషన్లు గత ఆర్థిక సంవత్సరం 4,80,488 యూనిట్ల నుంచి 4,77,381 యూనిట్లకు స్వల్పంగా పడిపోయాయి.