భిక్కనూరు, వెలుగు: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లోకి బస్సుల రాక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు. రోడ్డుపైనే నిలుపుతుండటంతో గంటలకొద్ది నిరీక్షించాల్సి వస్తోంది. బస్టాండ్‌లోకి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఇంత వరకు స్పందించలేదని చెబుతున్నారు.
బుధవారం కామారెడ్డి నుంచి జేబీఎస్ వెళ్తున్న కామారెడ్డి ఆర్టీసీ డిపో బస్సు భిక్కనూరు బస్టాండ్‌లోకి వెళ్లకపోవడంతో అక్కడ ఉన్న గ్రామస్తులు కొందరు బైక్‌లపై బస్సును వెంబడించి అడ్డుకున్నారు. బస్టాండ్‌లోకి ఎందుకు రావడంలేదని డ్రైవర్‌ను నిలదీయడంతో బాలుర పాఠశాల నుంచి మళ్లీ బస్టాండ్‌కు వెళ్లి ప్రయాణికుడిని ఎక్కించుకొని వెళ్లాడు. బస్సులు బస్టాండ్‌లోకి వచ్చే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.