ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. పికప్ వాహానాన్ని ఢీకొట్టింది. దీంతో అప్పటికే గాయపడి ఉన్న క్షతగాత్రులు మరోసారి గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ప్రయాణికులు బాలాసోర్ సమీపంలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో గాయపడ్డారు. వీరిని ప్రత్యేక బస్సులో ఆ రాష్ట్రానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాగా, శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్ జిల్లాలోని బాహానగా బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. 'సిగ్నల్ తప్పిదం'తో లూప్ లైన్‌లోకి ప్రవేశించిన షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. అప్పటికే ఆ ట్రాక్‌పై ఆగి వున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో భోగీలన్నీ చెల్లా చెదురుగా పడ్డాయి. అందులో కొన్ని కంపార్ట్‌మెంట్‌లు మెయిన్ లైన్‌పై పడ్డాయి. అనంతరం కాసేపటిలో మెయిన్ లైన్‌లోకి వచ్చిన యశ్వంత్‌పూర్- హౌరా ఎక్స్‌ప్రెస్, ఆ పట్టాలపై పడిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొట్టి పట్టాలు తప్పింది. దీంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 288 మంది చనిపోగా, 80ఓ మందికి పైగా గాయపడినట్లు అధికారులు ప్రకటించారు.