ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటన.. ఆ అనౌన్స్మెంట్తోనే తొక్కిసలాట !

ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటన.. ఆ అనౌన్స్మెంట్తోనే తొక్కిసలాట !
  • ప్రయాగ్​రాజ్ ట్రైన్ కోసం జనం పరుగులు..
  • రెండు రైళ్ల పేర్లు ఒకేలా ఉండడంతో గందరగోళం 
  • మరో 2 రైళ్లు ఆలస్యమవడంతో స్టేషన్​లో విపరీతమైన రద్దీ
  • ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటనలో18కి చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాటకు రైళ్ల పేర్లలో గందరగోళమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కుంభమేళా సందర్భంగా రైల్వే అధికారులు ప్రయాగ్​ రాజ్​కు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈ క్రమంలో రెండు రైళ్ల పేర్లు ఒకేలా ఉండడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారని ప్రాథమిక విచారణలో తేల్చారు. ‘‘శనివారం రాత్రి ప్లాట్ ఫామ్ నెంబర్ 14 మీదకు ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ వచ్చింది. ఆ ట్రైన్ ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 

అయితే, అదే టైమ్ లో ప్రయాగ్ రాజ్ స్పెషల్ ట్రైన్ ప్లాట్ ఫామ్ నెంబర్ 16 మీదకు వస్తున్నదని స్టేషన్ లో అనౌన్స్ మెంట్ చేశారు. దీంతో అప్పటికే ప్లాట్ ఫామ్ నెంబర్ 14 మీద ఉన్న ప్రయాణికులు కన్ఫ్యూజ్ అయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్.. ప్లాట్ ఫామ్ నెంబర్ 16 మీదకు వస్తున్నదేమోనని అనుకున్నారు. దీంతో ఆ ప్లాట్ ఫామ్ వైపు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై రద్దీ విపరీతంగా పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసింది.

అంతేకాకుండా శనివారం రాత్రి ప్రయాగ్ రాజ్ కు నాలుగు రైళ్లు వెళ్లాల్సి ఉండగా, మూడు ఆలస్యమయ్యాయి. దీంతో స్టేషన్ లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది” అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలిసింది. రైళ్ల పేర్ల విషయంలో ప్రయాణికులు గందరగోళానికి గురవడం, ట్రైన్ల ప్లాట్ ఫామ్ నెంబర్ మార్చడంతోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. 

కాగా, రైళ్లేవీ రద్దు చేయలేదని, ప్లాట్ ఫామ్ నెంబర్స్ కూడా మార్చలేదని రైల్వే శాఖ తెలిపింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కొంతమంది ప్రయాణికులు జారిపడి, ఇతరులపై పడ్డారని.. ఇదికాస్తా తొక్కిసలాటకు దారితీసిందని పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు టు మెంబర్ కమిటీని నియమించింది. వెంటనే విచారణ ప్రారంభించిన కమిటీ.. అన్ని సీసీ ఫుటేజీలను భద్రపరచాలని ఆదేశాలిచ్చింది.

ఇంత రద్దీ ఎప్పుడూ చూడలేదు: కూలీలు
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో ఇంతమంది జనాలను గతంలో ఎప్పుడూ చూడలేదని అక్కడ పనిచేసే కూలీలు తెలిపారు. తొక్కిసలాట జరిగిన రాత్రి స్టేషన్ లోని పరిస్థితిని మీడియాకు వివరించారు. ‘‘ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి పెద్ద ఎత్తున జనం చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఆ రద్దీలో మహిళలు, పిల్లలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. స్పాట్​లోనే 15 మంది దాకా చనిపోయారు. ప్లాట్ ఫామ్ నెంబర్ 14, 15 నుంచి డెడ్ బాడీలను తోపుడు బండ్లపై వేసుకుని అంబులెన్స్ దగ్గరికి తీసుకెళ్లాం. ఘటన జరిగిన ప్రాంతంలో బ్యాగులు, చెప్పులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి” అని కూలీలు చెప్పారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం..
తొక్కిసలాట ఘటనలో చనిపోయినోళ్ల సంఖ్య 18కి చేరింది. వీరిలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. చనిపోయినోళ్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడినోళ్లకు రూ.2.5 లక్షలు, మైనర్ గాయాలైనోళ్లకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపింది. కాగా, ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.