సీఎం సభకు ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

  • సీఎం సభకు ఆర్టీసీ బస్సులు
  • బస్టాండ్లలో ప్రయాణికుల తిప్పలు
  • అన్ని డిపోల బస్సులు కేసీఆర్​ మీటింగు కే...
  • తల్లడిల్లిన వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు
  • ప్రైవేట్​ వాహనాల్లో డబుల్ ఛార్జీలు వసూలు

నెట్​వర్క్​, వెలుగు : జగిత్యాలలో సీఎం కేసీఆర్​ బహిరంగసభకు జనాన్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంతో ప్రయాణికులు ఎదుర్కొన్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. జగిత్యాల జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని డిపోల నుంచి సగానికి పైగా బస్సులను సీఎం సభకు మళ్లించారు. దాంతో టైమ్​కు బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు పడ్డారు.  జగిత్యాలలో  బుధవారం జరిగిన సీఎం కేసీఆర్​ సభకు    కామారెడ్డి డిపో  నుంచి  50 బస్సులను పంపారు. దీంతో గ్రామీణ రూట్లలో  బస్సు సర్వీసులు నడవక ప్యాసింజర్లు గంటల తరబడి  బస్సుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. కామారెడ్డి  డిపోలో 136 బస్సులుండగా  50 బస్సులను మళ్లించడంతో  నిజాంసాగర్​,  పిట్లం,  కరీంనగర్,   నిజామాబాద్,  గుండారం, దోమకొండ , గాంధారి, బాన్స్​వాడ రూట్లలో  సర్వీసులను తగ్గించారు.  15 నిమిషాలకు ఒక బస్సు  వెళ్లాల్సిన రూట్​లో  గంటన్నరకు ఒకటి పంపారు.   కొన్ని గ్రామీణ సర్వీసులను పూర్తిగా రద్దు చేశారు. చంటిబిడ్డలున్న  మహిళలు గంటల తరబడి వెయి ట్ ​చేయలేక అసౌకర్యానికి గురయ్యారు.  పెండ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ ​కావడంతో  ఉన్న బస్సుల్లోనే  కిక్కిరిసి,  వేలాడుతూ ప్రయాణం చేశారు. బస్సులు లేక నిజామాబాద్ బస్టాండ్ లో ప్యాసింజర్లు ఇబ్బంది పడ్డారు.  నిజామాబాద్​ నుంచి నిర్మల్, అదిలాబాద్,  జగిత్యాల, వరంగల్ వైపు వెళ్లే బస్సులను  సభకు కేటాయించారు.  వరంగల్​ ఉమ్మడి జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి కూడా బస్సులను సభకు తరలించారు. స్కూళ్లు, కాలేజీ​లు, ఆఫీసులకు వెళ్లేందుకు బస్టాండ్లు, రోడ్లపైకి వచ్చినవాళ్లు గంటల తరబడి బస్సుల కోసం వెయిట్​ చేశారు.  అన్ని డిపోల నుంచి 50 శాతం కన్నా ఎక్కువ  బస్సులను పంపారు.    ఒకటి రెండు బస్సులు నడవగా వాటిలో  కిక్కిరిసి ప్రయాణం చేశారు.  ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో.. ప్రైవేట్​ వాహన దారులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. 

కరీంనగర్​లో 500 బస్సులు తరలింపు

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలోని డిపోల నుంచి  సీఎం  సభకు దాదాపు  500లకు పైగా  బస్సులను తరలించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా  ప్రయాణికులు అవస్థలు  పడాల్సి వచ్చింది. కరీంనగర్ బస్టాండ్​లో ఒక్క బస్ కూడా లేక  బంద్ వాతావరణం కనిపించింది. పొద్దున్నే ఆఫీసులు,  కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే స్టూడెంట్స్  తిప్పలు పడ్డారు. వచ్చిన కొన్ని  బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించారు.  వృద్ధులు, చంటిపిల్లల తల్లులు గంటల తరబడి బస్సుల్లో నిలబడ లేక అవస్థలు పడ్డారు.  జగిత్యాలలో ఎంతకూ   బస్సులు రాక  ఆటోలు, ట్రాలీలు,  ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్లారు.   బస్సులు రాక కోరుట్ల బస్టాండ్​ వెలవెలపోయింది. ఇక్కడి నుంచి  నిజామాబాద్​, కరీంనగర్​ , వేములవాడ  వెళ్లే  ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్​లో పడిగాపులు పడ్డారు. అత్యవసరమైన వారు ప్రైవేట్​ వాహనాలను ఆశ్రయించగా డబుల్​  చార్జీలు వసూలు చేశారు.  వేములవాడ డిపోలోని 60 బస్సుల్లో 30 బస్సులను సభకు మళ్లించడంతో రాజన్న భక్తులు ఇబ్బందులు పడ్డారు. గంటల పాటు వెయిట్​ చేసిన భక్తులు చివరికి ఎక్కువ చార్జీలు చెల్లించి ప్రైవేట్​ వాహనాల్లో తరలివెళ్లారు.  సభ దగ్గర  బందోబస్తుకు వచ్చిన పోలీసులకు ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో  2కిలోమీటర్లు  నడిచి వచ్చి.. నడిచే తిరిగి వెళ్లారు.  నిజామాబాద్ , వేములవాడ నుంచి కోరుట్ల మీదుగా జగిత్యాల సభకు భారీగా వెహికల్స్​ వెళ్లడంతో  కోరుట్ల హైవేపై  ట్రాఫిక్​ జామ​య్యింది.  చాకలి ఐలమ్మ విగ్రహం  కనిపించకుండా కట్టిన టీఆర్​ఎస్  ఫ్లెక్సీని  గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.    

సీఎంను కలవనియ్యలే

సీఎంను కలిసి  తమ బాధ  చెప్పుకుందామని వచ్చిన వారికి నిరాశే మిగిలింది. సీఎం స్వగ్రామం చింతమడకకు చెందిన  మహిళా రైతు చనిపోతే రైతుబీమా రాలేదని చెప్పుకునేందుకు ఆమె భర్త గజ్జల కనకయ్య  జగిత్యాలకు వచ్చాడు.  సీఎంను కలిసేందుకు అవకాశం ఇప్పించాలని  ఎంత వేడుకున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. తనకు వికలాంగుల పింఛన్​ రావడం లేదని చెప్పుకుందామని వస్తే   పోలీసులు వెళ్లనీయడం లేదని మరో బాధితుడు  పూసాల బుచ్చయ్య  వాపోయాడు.  మల్లాపూర్ మండలం కుస్తాపూర్ మాజీ సర్పంచ్  గుండ బుచ్చన్న    కేసీఆర్ బొమ్మతో పాలన వైఫల్యాలు వివరిస్తూ పోస్టర్​ ప్రదర్శించారు. బాధితులను  సీఎంతో కలవనీయకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.  

గంటన్నర పాటు చూస్తే బస్సు వచ్చింది

బాన్స్​వాడకు వెళ్లడానికి బస్టాండుకు వస్తే  బస్సే లేదు. గంటన్నర పాటు వెయిట్​ చేయాల్సివచ్చింది.   ఒకే బస్సులో  రెండు బస్సులకు సరిపడా మంది వెళ్లాల్సి వస్తోంది.   బాన్స్​వాడ రూట్లో  15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుండే. ఇవాళ  సీఎం మీటింగ్​ ఉన్నదని చెప్పి అన్నీ తగ్గించారు.  సీఎం మీటింగ్​ పెట్టుకుంటే మేమెందుకు కష్టపడాలె. ఇంకోసారి ఇట్లా జరగకుండా చూడాలె.   
-రాజులు, బాన్స్​వాడ