ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆదివారం ఓ ఆర్టీసీ బస్సు వెనక చక్రాలు ఊడిపోవడంతో ప్రయాణికులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. కరీంగనగర్ జిల్లా హుజూరాబాద్ డిపోకు చెందిన పల్లెవెలుగు (అద్దె) బస్సు హుజూరాబాద్ నుంచి 80 మందితో హనుమకొండకు బయల్దేరింది. ఎల్కతుర్తి మండల కేంద్రానికి చేరుకోగానే పెద్ద శబ్దంతో ఒక్కసారిగా రోడ్డుపై ఆగిపోయింది. రన్నింగ్‌లో బస్సు ఎడమవైపు వెనుక రెండు టైర్లు ఊడిపోయి పొలాల్లోకి దూసుకెళ్లాయి.
ఆ సమయంలో బస్సు నెమ్మదిగా వెళ్తుండడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు వేగంగా ఉంటే బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. కాగా, బస్సు కెపాసిటీ 55 మంది అయితే పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం వల్లే బోల్టులు ఊడిపోయాయని డ్రైవర్ చెప్పాడు. అయితే, బస్సు మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే టైర్లు ఊడిపోయాయని ప్రయాణికులు చెప్పారు. ఇతర బస్సుల్లో ప్రయాణికులకు గమ్యస్థానాలకు తరలించారు.
ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వండి : ఎండీ సజ్జనార్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద బస్సు ప్రమా ద ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారుల ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నది 42 మందే అని, 80 మంది ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని సజ్జనార్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అద్దె బస్సుల నిర్వహణపై యజమానులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకోవాలని సూచించారు.