
కుంభమేళాకు ఇవాళ ( ఫిబ్రవరి 26 ) చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్ కు క్యూ కట్టారు. కుంభమేళా చివరి రోజుతో పాటు మహాశివరాత్రి కూడా కావడంతో పవిత్ర స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్ కు వెళుతున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి చాలా మంది భక్తులు వారణాసి వెళ్లేందుకు స్పైస్ జెట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే.. కుంభమేళా భక్తులకు చివరి నిమిషంలో షాక్ ఇచ్చింది స్పైస్ జెట్.. ప్రయాణికులు బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలి వెళ్లిన తర్వాత ఫ్లైట్ ఆలస్యం అంటూ అనౌన్స్ చేసింది స్పైస్ జెట్.
చివరి నిమిషంలో అనౌన్స్మెంట్:
బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలి వెళ్లిన తర్వాత అనౌన్స్ మెంట్ రావటంతో చేసేదేమీ లేక ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే వైట్ చేశారు. మూడు గంటలు అవుతున్నా కానీ.. ఫ్లైట్ రాకపోవటంతో ఆందోళనకు దిగారు ప్రయాణికులు. చివరి నిమిషంలో ఫ్లైట్ డిలే అంటూ అనౌన్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులు.
కుంభమేళాకు వెళ్లగలమో లేదో అన్న అయోమయం ఒకపక్క, స్పైస్ జెట్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం మరో పక్క వెరసి.. ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు. అయినప్పటికీ సమాధానం చెప్పలేదు ఎయిర్ లైన్స్ సిబ్బంది.
రూ. 48వేలు పెట్టి టికెట్ కొన్నామంటూ ఆవేదన:
ఉదయం 10 గంటలకు వెళ్లాల్సిన విమానం..ఇప్పటికీ రాలేదని, 3గంటలుగా ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. రూ. 48వేలు పెట్టి టికెట్ కొన్నామని వాపోతున్నారు ప్రయాణికులు. తమను పట్టించుకునే నాధుడే లేదంటూ ఆందోళనకు దిగారు ప్రయాణికులు. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు.