- రోడ్లపైనే జనం పడిగాపులు..అడ్వర్టైజ్మెంట్ల ఆదాయంపైనే బల్దియా దృష్టి
- ప్రయాణికులు ఎక్కువగా ఉండే చోటే ఏర్పాటు చేస్తున్న ఏజెన్సీలు
- 411 ప్రాంతాల్లో షెల్టర్లు కావాలన్న ఆర్టీసీ
- 78 ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు
- చెట్ల కింద, రోడ్లపై నిలబడుతున్న ప్రయాణికులు
- ఉన్న చోట్ల మెయింటనెన్స్ లేదు
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ లో చాలా చోట్ల బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్లపై నిలబడాల్సి వస్తున్నది. బస్షెల్టర్లు నిర్మించే బల్దియా ప్రజలకు అవసర మున్న చోట కాకుండా అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ వచ్చే ఏరియాల్లోనే ఏర్పాటు చేస్తుండడంతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రేటర్ పరిధిలో బస్సు షెల్టర్ల ను నిర్మించే బాధ్యతను ఆర్టీసీ 2008లో జీహెచ్ఎంసీకి అప్పగించింది.
ఆర్టీసీ ఎక్కడెక్కడ షెల్టర్లు అవసరమో గుర్తించి ఆ ప్రపోజల్స్‌ను బల్దియాకు పంపుతుంది. తర్వాత జీహెచ్ఎంసీ నిర్మాణ బాధ్యతలను యాడ్ ఏజెన్సీలకు అప్పగిస్తుంది. ఇలా షెల్టర్లు లేని 411 ప్రాంతాల్లో నిర్మించాలని ఆర్టీసీ అధికారులు గత ఏడాది జీహెచ్ఎంసీకి లెటర్ రాశారు. కానీ, బల్దియా మాత్రం 78 ప్రాంతాల్లో బస్ షెల్టర్లు నిర్మించి చేతులు దులుపుకుంది. ఇందులో కొన్ని నేటికీ అందుబాటులోకి తీసుకురాలేదు.
యాడ్ల కోసమే
గ్రేటర్లో రోజూ 12 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వీరి కోసం సుమారు 4 వేల బస్ షెల్టర్లు అవసరమని ఒక అంచనా. అయితే. 1,050 రూట్లలో 2350 బస్టాపులు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో రోడ్ల వైడెనింగ్, ఫ్లై ఓవర్ల నిర్మాణాలతో 1170 మాత్రమే మిగిలాయి. వీటిని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీఓటీ) పద్ధతిన మెస్సర్స్ యూని యాడ్స్ లిమిటెడ్, మెన్సర్స్ ప్రకాష్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ కేకే ఆర్సీ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు బల్దియా కేటాయించింది.
వీరు ఆదాయం కోసం జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే షెల్టర్లు నిర్మిస్తుండడంతో మిగతా చోట్ల ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. షెల్టర్లపై ఏర్పాటు చేసే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా జీహెచ్ఎంసీకి ఏటా రూ.25 కోట్ల వరకు ఆదాయం వస్తుండడంతో మెయింటెనెన్స్ సరిగ్గా ఉంటుందా లేదా అన్నది పట్టించుకోవడం లేదు. ఫీల్డ్‌లోకి వెళ్లి చూస్తే చాలా షెల్టర్లలో కూర్చునే పరిస్థితి కూడా లేదు.
ప్రధాన రోడ్లపైనే పదుల సంఖ్యలో బస్ షెల్టర్లు ఉంటున్నాయి. దిల్ సుఖ్‌నగర్, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, కోఠి, మెహిదీపట్నం, కూకట్ పల్లి, బంజారాహిల్స్ వంటి కమర్షియల్ ఏరియాల్లో వరుసగా బస్ షెల్టర్ లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకా నిర్మిస్తూనే ఉన్నాయి. బస్టాప్‌లు లేని చోట వృద్ధులు, స్టూడెంట్స్, మహిళలు రోడ్లపై నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు.
స్టూడెంట్స్ అయితే బ్యాగులు మోస్తూ వెయిట్ చేయలేక ఫుట్ పాత్ లపై కూర్చుంటున్నారు. వర్షాలు కురిసినప్పుడు, ఎండలు మండుతున్నప్పుడు సమీపంలోని చెట్ల కిందకు పరుగులు తీస్తూ బస్సులు మిస్సవుతున్నారు.
చెత్త, మురుగు కంపు..
సిటీలో ఉన్న చాలా బస్టాప్‌లు క్లీన్ గా ఉండడం లేదు. షెల్టర్లలో చెత్త, ఆవరణలో మురుగు ప్రవహిస్తోంది. కొన్ని టాయిలెట్ల పక్కన, మరికొన్ని నాలాలు, డ్రైనేజీల పక్కన ఉండడంతో చుట్టూ మురుగే కనిపిస్తోంది. దీంతో దోమలు పెరిగి నిలబడనీయడం లేదు. వర్షాలు కురిసినప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. దుర్గంధం తట్టుకోలేక బస్టాపులకు దూరంగా నిలబడి బస్సులెక్కుతున్నారు.
కొన్ని షెల్టర్లయితే పై కప్పులు లేకుండా ఉన్నాయి. మరికొన్ని చోట్ల కుర్చీలే ఉండట్లేదు. సిటీలో కొన్ని చోట్ల ఆర్భాటంగా ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేయగా చాలా చోట్ల ఎయిర్కండీషన్పని చేయడం లేదు.
ఇవీ సమస్యలు
లంగర్ హౌస్ లో నాలుగు ప్రాంతాల్లో బస్టాప్‌లు ఉన్నా ఒక్కచోట మాత్రమే బస్‌షెల్టర్ ఉంది. లంగర్ హౌస్, బాపూనగర్ రెండు ప్రాంతాల్లో కలిపి నాలుగు స్టాప్ లున్నాయి. నాలుగు నెలల కిందటి వరకు నానల్ నగర్ నుంచి సన్ సిటీ వైపు వెళ్లే ప్రాంతాల్లో బాపూనగర్ వద్ద బస్టాప్ ఉండేది. ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు కావడంతో ఈ స్టాప్ ను బాపుఘాట్ కి షిఫ్ట్ చేశారు.
దీంతో కిలోమీటర్ దూరం నడవాల్సి వస్తోంది. బాపునగర్ నుంచి మెహిదీపట్నం వెళ్లే రూట్ లో బాపునగర్, లంగర్ హౌస్ రెండువైపులా అసలు బస్టాపులే లేవు. ఇక్కడ ఇప్పటికీ రోడ్లపైన, చెట్ల కింద నిలబడి బస్సులెక్కాల్సి వస్తున్నది. ఓయూ సమీపంలోని శివంరోడ్డు బస్టాప్ లో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్లపైనే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పక్కన బస్ షెల్టర్ ఉన్నా అంబర్ పేట్ నుంచి విద్యానగర్ వెళ్లే రూట్ లో బస్‌షెల్టర్ నిర్మించలేదు.