నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్.. తెలంగాణకు నలుగురు కొత్త IPSలు

నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్.. తెలంగాణకు నలుగురు కొత్త IPSలు
  • 188 మంది ఐపీఎస్‌‌ల ట్రైనింగ్​ పూర్తి
  • తెలంగాణకు నలుగురు కేటాయింపు
  • వరంగల్‌‌కు చెందిన ఇద్దరు యువ ఐపీఎస్‌‌లు
  • రేపు ఎన్‌‌పీఏలో పాసింగ్  అవుట్ పరేడ్

హైదరాబాద్‌‌, వెలుగు: దేశ అంతర్గత భద్రత, సైబర్ క్రైమ్‌‌, నార్కొటిక్స్‌‌, డ్రగ్స్‌‌ నిర్మూలనకు పోలీస్ అధికారులు కృషి చేయాలని నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ సూచించారు. యువ ఐపీఎస్ అధికారులు భవిష్కత్ తరాలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. కేసుల దర్యాప్తులో సక్సెస్‌‌, ఫెయిల్యూర్‌‌‌‌ను ప్రామాణికంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. శివరాంపల్లిలోని సర్దార్‌‌‌‌వల్లభాయ్‌‌ పటేల్‌‌ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం 2023 బ్యాచ్‌‌ ఐపీఎస్‌‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌‌ జరగనుంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 

ఈ నేపథ్యంలో అమిత్‌‌గార్గ్‌‌ బుధవారం ప్రెస్​మీట్​పెట్టి మాట్లాడారు. ఐపీఎస్‌‌లకు ప్రధానంగా సైబర్ నేరాలు డ్రగ్స్, ట్రాఫికింగ్‌‌ అరికట్టడం, డ్రోన్‌‌ టెక్నాలజీ వినియోగంపై ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అత్యాధునిక ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌‌, కొత్త క్రిమినల్ చట్టాలు, క్షేత్ర స్థాయిలో ఇండోర్, అవుట్‌‌ డోర్ శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతపై ఎన్‌‌ఐఏ సహా వివిధ సెంట్రల్ ఏజెన్సీల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. కాగా, 188 మంది ఐపీఎస్​లతోపాటు, నేపాల్‌‌, రాయల్‌‌ భూటాన్‌‌, మారిసెస్‌‌, మాల్దీవులకు చెందిన 19 మంది ఫారిన్ ఆఫీసర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వెల్లడించారు. తెలంగాణ కేడర్‌‌‌‌కు వరంగల్‌‌ జిల్లాకు చెందిన  రిత్విక్‌‌ సాయి కొట్టె, పత్తిపాక సాయికిరణ్‌‌, జమ్ము కశ్మీర్‌‌‌‌కు చెందిన మనన్‌‌ భట్, యూపీకి చెందిన యాదవ్ వసుంధర ఫరెబీలను కేటాయించారు. ట్రైనింగ్​లో టాపర్స్​గా నిలిచిన 8 మంది పరేడ్ అనంతరం ట్రోఫీలు అందుకోనున్నారు. 

తెలంగాణకు కేటాయించడం హ్యాపీగా ఉంది

మా నాన్న రాధాకృష్ణ  సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌‌మెంట్‌‌లో పనిచేస్తారు. నేను ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. రాష్ట్ర కేడర్‌‌‌‌కు కేటాయించడం ఆనందంగా ఉంది. పోలీస్ స్టేషన్‌‌ స్థాయి నుంచి ప్రజలకు ఎదురయ్యే మంచి చెడులను గమనించాను. బాధితులకు న్యాయం చేసేలా విధులు నిర్వహిస్తాను.
– రిత్విక్‌‌ సాయి కొట్టె, వరంగల్

మూడో అటెంప్ట్​లో సక్సెస్ ​అయ్యా

మాది వ్యవసాయ కుటుంబం. అక్క, చెల్లి ఉన్నారు. సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశాను. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌‌కి ప్రిపేర్ అయ్యాను. సరైన గైడెన్స్‌‌ లేక కొంతకాలం ఇబ్బందులు పడ్డాను. ఎలాగైనా యూనిఫాం వేసుకోవాలని కష్టపడి చదివాను. మూడో అటెమ్ట్‌‌లో సక్సెస్ అయ్యాను. 460 ర్యాంక్ వచ్చింది. తెలంగాణ కేడర్‌‌‌‌కే కేటాయిండం సంతోషంగా ఉంది. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తాను. 
–  పత్తిపాక సాయికిరణ్‌‌,  కొత్తపల్లి గ్రామం, వరంగల్ జిల్లా