
లక్నో: ముస్లింల అతిపెద్ద పండుగ రంజాన్ వేళ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ పండగను పురస్కరించుకుని ఎవరైనా రోడ్లపై ప్రార్థనలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై నమాజ్ చేసే వారి పాస్ పోర్టులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మీరట్ ఎస్పీ ఆయుష్ విక్రమ్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ వేళ మసీదులలో మాత్రమే ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరుతున్నామని.. ఈ మేరకు ముస్లిం మత పెద్దలు, ఇమామ్‌లకు విజ్ఞప్తి చేశామని తెలిపారు.
ఈద్ ప్రార్థనలు స్థానిక మసీదులు లేదా ఈద్గాలలో నిర్వహించుకోవాలని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా రోడ్లపై ప్రార్థనలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సున్నితమైన ప్రాంతాలల్లో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎలాంటి మత విద్వేషాలు వ్యాప్తి చెందకుండా సోషల్ మీడియాను కూడా నిశితంగా పరిశీలిస్తామని.. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత రంజాన్ పండగ సందర్భంగా కొంతమంది నిబంధనలను ఉల్లంఘించారని.. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు.
ALSO READ : Aviation: దేశంలో కొత్త విమాన సంస్థలు.. ఇండిగో-టాటాలతో పోటీపడతాయా?
చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టమని హెచ్చరించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా కఠినంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రంజాన్ వేళ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా సున్నితమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా దళాలను మోహరిస్తామని వెల్లడించారు. మీరట్ పోలీసుల ఆదేశాలపై కేంద్ర మంత్రి జయంత్ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన కేంద్రమంత్రి.. పోలీసులు పాస్‌పోర్ట్‌లను జప్తు చేస్తామని చెప్పకూడదని అన్నారు. ఈ సున్నితమైన అంశంపై సామరస్యపూర్వకంగా చర్చలు జరపాలని సూచించారు.