చండీగఢ్ : దయ్యం వదిలిస్తానని ఓ యువకుడిని కొట్టి చంపాడో పాస్టర్. ఈ ఘటన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని సింగ్‌పుర గ్రామానికి చెందిన శామ్యూల్ మాసిహ్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా మూర్చ వ్యాధి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఎప్పుడుపడితే అప్పుడు ఇంట్లో గట్టిగట్టిగా కేకలు వేసేవాడని పోలీసులు తెలిపారు.
దీంతో కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న జాకోబ్ మాసిహ్ అనే పాస్టర్‌ను కలిసి, తమబిడ్డను కాపాడాలని కోరారు. దీంతో ఆయన వచ్చి చూసి మీ అబ్బాయికి దయ్యం పట్టిందని చెప్పారు. కంగారు పడాల్సిన అవసరం లేదని, దయ్యాన్ని తాము వదిలిస్తామన్నారు.
ఈ క్రమంలో పాస్టర్‌తో పాటు మరో 8 మంది శామ్యూల్‌ను కొట్టడం ప్రారంభించారు. ఇలాచేస్తే దయ్యం వెళ్లిపోతుందని కుటుంబసభ్యులను నమ్మించారు. దీంతో బాధితుడిని అందరూ కలిసి తీవ్రంగా కొట్టడంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ మరుసటి రోజు శామ్యూల్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. రెండ్రోజుల తర్వాత శామ్యూల్ తల్లి, భార్య.. పాస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శామ్యూల్ డెడ్‌బాడీని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. 8 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.