- కడియం ఎంట్రీతో మారిన సీన్
- శ్రీహరికి గానీ, ఆయన కూతురు కావ్యకు గానీ కాంగ్రెస్ టికెట్ అంటూ ప్రచారం
- అయోమయంలో సిట్టింగ్ ఎంపీ పసునూరి
హనుమకొండ, వెలుగు : కడియం శ్రీహరి పార్టీ మార్పు వ్యవహారం ఓరుగల్లు రాజకీయాల్లో వేడి పుట్టించింది. కడియం బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరనుండడం, వరంగల్ ఎంపీ టికెట్ ఆయనకు గానీ, ఆయన కూతురు కావ్యకు గానీ దక్కనుందని ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కాంగ్రెస్ తరఫున ఎంపీ టికెట్ ఆశించిన చాలా మంది లీడర్లు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ముఖ్యంగా ఈ టికెట్ కోసమే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ అయోమయంలో పడ్డారు.
టికెట్ కోసం కాంగ్రెస్‌లో చేరిన పసునూరి
ఎస్సీ రిజర్డ్వ్ అయిన వరంగల్ పార్లమెంట్ స్థానంలో పసునూరి దయాకర్ 2015, 2019 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున భారీ మెజార్టీతో విజయం సాధించారు. మూడోసారి కూడా గెలవాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కూతురైన డాక్టర్ కావ్యకు టికెట్ ఇప్పించేందుకు పావులు కదిపారు. దీంతో బీఆర్‌ఎస్ వరంగల్ ఎంపీ క్యాండిడేట్‌గా కడియం కావ్యను డిక్లేర్ చేస్తూ మార్చి 13న బీఆర్‌ఎస్ హైకమాండ్ ప్రకటించింది.
దీంతో తీవ్ర నిరాశకు గురైన పసునూరి దయాకర్ మార్చి 16న మంత్రి కొండా సురేఖ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ తరఫున ఎంపీ టికెట్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. టికెట్ కూడా ఆయనకే కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం జరిగింది. కానీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటించడం, తర్వాత కాంగ్రెస్ నేతలతో సమావేశం కావడంతో ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది.
కడియం ఎంట్రీతో అయోమయం
వరంగల్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ లీడర్లు దొమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిర, పెరుమాండ్ల రామకృష్ణ, జేఎస్. పరంజ్యోతి, రామగళ్ల పరమేశ్వర్ పోటీ పడుతున్నారు. కానీ టికెట్ పసునూరి దయాకర్‌కే కన్ఫర్మ్ అయిందని నియోజకవర్గంలో ప్రచారం జరుగగా, ఆయన కూడా అదే ధీమాతో ఉన్నారు. కానీ ఈ నెల 28న కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ అగ్రనేతలను కలవడం
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ నేతలు కడియంను పార్టీలో ఆహ్వానించడంతో పరిస్థితి మొత్తం తారుమారైంది. వరంగల్ కాంగ్రెస్ టికెట్ ఇస్తామన్న హామీతోనే కడియం, కావ్య ఇద్దరూ హస్తం గూటికి చేరుతున్నట్లు ప్రచారం సాగుతుండడంతో పసునూరి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తలతో హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టిన కడియం ఒకటి, రెండు రోజల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఆ వెంటనే కడియం శ్రీహరి లేదా ఆయన కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కడియం వైపే హైకమాండ్ మొగ్గు
రెండు సార్లు భారీ మెజార్టీతో గెలిచిన పసునూరి, ఈ సారి కూడా విజయం తనదేనని భావించారు. కానీ కడియం ఎంట్రీతో పసునూరి పరిస్థితి అయోమయంలో పడింది. టికెట్ కడియం ఫ్యామిలీకే దక్కుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ తన వంతుగా ప్రయత్నాలు చేశారని తెలిసింది. కానీ పార్టీ పెద్దలు కడియం వైపే మొగ్గు చూపుతుండడంతో పసునూరి సైలెంట్ అయ్యినట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుంచి అరూరి రమేశ్ బరిలో ఉండగా, కడియం కావ్య తిరస్కరించడంతో బీఆర్‌ఎస్ ప్రత్యామ్నాయ నాయకులను వెతుకుతోంది. కాంగ్రెస్ రెండు, మూడు రోజుల్లో కడియం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.