Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుండి మరో ఇద్దరు ఔట్.. ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలవరం

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ నుండి మరో ఇద్దరు ఔట్.. ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలవరం

మరో వారం రోజుల్లో ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ (2025) ప్రారంభం కావాల్సి ఉండగా.. ఆస్ట్రేలియా క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మెగా టోర్నీలో నలుగురైదుగురు స్టార్ ఆటగాళ్ల సేవలను క్రికెట్ ఆస్ట్రేలియా కోల్పోనుంది. స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఉన్నపళంగా రిటైర్మెంట్ ప్రకటించడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ. వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు స్టోయినిస్ గురువారం(ఫిబ్రవరి 06) ప్రకటన చేశాడు. తక్షణమే తన రిటైర్మెంట్ అమలులోకి వస్తుందని వెల్లడించాడు. అందుకు గల కారణాలు ఏంటనేది బయట పెట్టలేదు.

ఆ ఇద్దరూ ఆడరు..

ఇది జరిగిన గంటల వ్యవధిలోనే క్రికెట్ ఆస్ట్రేలియా మరో ప్రకటన చేసింది. పేసర్లు పాట్ కమ్మిన్స్, జోష్ హాజెల్‌వుడ్ గాయాల నుంచి కోలుకోలేదని.. వీరిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అందుబాటులో ఉండరని క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్రకటించింది. భారత్‌తో జరిగిన బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ ముగింపులో ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ చీలమండ నొప్పి బారిన పడగా.. పిక్క నొప్పి నుండి హేజిల్‌వుడ్ ఇంకా కోలుకోలేదు.

 మొత్తం నలుగురూ..!

కమ్మిన్స్(చీలమండ గాయం), జోష్ హాజిల్‌వుడ్(పిక్క నొప్పి), మిచెల్ మార్ష్(వెన్ను నొప్పి) లకు గాయాలు కాగా.. మార్కస్ స్టోయినిస్(రిటైర్మెంట్). మ్యాచ్ విన్నర్లైన ఈ నలుగురు దూరమవ్వడం ఆస్ట్రేలియా జట్టుకు భారీ దెబ్బ అని చెప్పుకోవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు పాకిస్థాన్, దుబాయ్ గడ్డపై జరగనున్నాయి.  ఈ రెండూ దేశాల్లోని వేదికలు స్పిన్ పిచ్‌లు. బంతి గింగిరాలు తిరుగుతూ వస్తుంది. అటువంటి పిచ్‌లపై అనుభవం లేని ఆటగాళ్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇదే ఆసీస్ జట్టును కలవర పరుస్తోంది.