Border–Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. దేశవాళీ క్రికెట్ బాట పట్టనున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు

Border–Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. దేశవాళీ క్రికెట్ బాట పట్టనున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగబోయే ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ  2024-25 టెస్ట్ సిరీస్ నవంబర్ 22 నుంచి జనవరి 3 వరకు జరుగుతుంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఐదు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఆస్ట్రేలియాలో జరిగిన చివరి రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు భారత్ గెలుచుకుంది. దీంతో ఈ సారి ఆస్ట్రేలియా  సొంతగడ్డపై ఎలాగైన ఈ ప్రతిష్టాత్మక సిరీస్ గెలుచుకోవాలని చూస్తుంది. దీని కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు.

ఆస్ట్రేలియాలో అత్యంత ప్రాముఖ్యమైన షెఫీల్డ్ షీల్డ్ సీజన్ అక్టోబర్ 8న ప్రారంభమవుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముందు ఆసీస్ ప్రధాన ఆటగాళ్లు ఈ టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యారు. తొలి రెండు రౌండ్ లో ఆసీస్ కీలక ఆటగాళ్లు ఆడనున్నారు.  ట్రావిస్ హెడ్, అలెక్స్ కారీ, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్‌, స్టీవ్ స్మిత్,కామెరాన్ గ్రీన్ మరియు మిచ్ మార్ష్, మార్నస్ లాబుస్‌చాగ్నే ఈ లిస్టులో ఉన్నారు. 

నవంబర్ 4 నుంచి 18 వరకు సొంతగడ్డపై ఆస్ట్రేలియా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్ లకు ఆతిధ్యమివ్వనుంది. ఈ సిరీస్ సమయానికి ఆసీస్ ఆటగాళ్లు షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ముగించుకొని అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడతారు. ఆస్ట్రేలియా గడ్డపై చివరగా జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు గెలుచుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్  72 ఏళ్లలో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిస్తే.. 2020-21లో తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే సారధ్యంలో 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. చివరిసారిగా 2023 లో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో గెలుచుకోవడం విశేషం.