AFG vs AUS: వసీం అక్రమ్ 25 ఏళ్ల రికార్డు సమం చేసిన కమ్మిన్స్

AFG vs AUS: వసీం అక్రమ్ 25 ఏళ్ల రికార్డు సమం చేసిన కమ్మిన్స్

ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా రెండు హ్యాట్రిక్‌లు సాధించిన మొదటి ఆటగాడిగా ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం(జూన్ 23) ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కమ్మిన్స్.. రషీద్ ఖాన్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. గురువారం(జూన్ 20) బంగ్లాదేశ్‌తో జరిగిన మునుపటి సూపర్ ఎయిట్ పోరులోనూ ఆసీస్ కెప్టెన్ హ్యాట్రిక్ సాధించాడు.

రెండవ ఆటగాడు

అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌లు సాధించిన రెండవ ఆటగాడు.. కమ్మిన్స్. గతంతో పాకిస్తాన్‌ పేసర్ వసీం అక్రమ్ వరుసగా రెండు గేమ్‌ల్లో రెండు హ్యాట్రిక్‌లు సాధించాడు. 1999, మార్చిలో శ్రీలంకతో జరిగిన ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో అక్రమ్ ఈ  ఘనత సాధించాడు. 

ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో మ్యాచ్‌లో లంక బ్యాటర్లు బంతుల్లో రొమేష్ కలువితరణ, నిరోషన్ బండారతిల్కే, ప్రమోద్య విక్రమసింఘేలను అవుట్ చేసి అక్రమ్ మొదటి హ్యాట్రిక్ సాధించాడు. అనంతరం టోర్నీ ఫైనల్‌లో అవిష్క గుణవర్ధనే, చమిందా వాస్ , మహేల జయవర్ధనేలను అవుట్ చేయడం ద్వారా మరో హ్యాట్రిక్ సాధించాడు. ఇన్నేళ్ల తరువాత ఆసీస్ పేసర్ అద్భుత ప్రదర్శనతో.. 25 ఏళ్ల అక్రమ్ రికార్డును సమం చేశాడు.

ఆసీస్ సెమీస్ ఆశలు సంక్లిష్టం

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే, ఆఫ్గనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా  21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత ఆఫ్ఘన్ బ్యాటర్లు 148 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో కంగారూల జట్టు 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. సోమవారం(జూన్ 24) భారత్‌తో జరిగే మ్యాచ్‌లో.. ఆసీస్ జట్టు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఒకవేళ కమిన్స్ సేన.. టీమిండియా చేతిలో ఓటమిపాలై, మరో మ్యాచ్‌లో ఆఫ్ఘన్.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేస్తే ఆఫ్ఘన్లు సెమీస్ చేరతారు.