మైదానంలో అడుగుపెట్టామా.. పరుగుల వరద పారించామా.. ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించామా..! ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు అనుసరిస్తున్న వ్యూహమిది. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో జట్టులోని ప్రతి ఆటగాడు రాణిస్తున్నాడు.. విజయం కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. అదే జట్టును విజయాల బాటలో నడిపిస్తోంది.
బెంగళూరు గడ్డపై రికార్డుల మోత
సోమవారం(ఎప్రిల్ 15) బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ల ఊచకోతకు రికార్డులు మోకరిల్లాయి. ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు ట్రావిస్ హెడ్(102), హెన్రిచ్ క్లాసెన్(69)ల బౌండరీల ప్రవాహానికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తడిసిముద్దైంది. మార్చి 27న ముంబై ఇండియన్స్‌పై 277 స్కోరు చేసి.. నెలకొల్పిన ఐపీఎల్ లో అత్యధిక పరుగుల రికార్డును 20 రోజుల్లోపే మరిపించారు. బెంగళూరు గడ్డపై బౌండరీల వర్షం కురిపిస్తూ 287 పరుగులతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. వీరి దూకుడు చూస్తుంటే.. ప్రత్యర్థి జట్లు మైదానంలోకి అడుగుపెట్టక ముందే భయపడేలా చేస్తున్నారు. అచ్చం ఇదే విషయాన్ని హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. ఆర్‌సీబీపై గెలుపు అనంతరం కమిన్స్ జట్టు సమావేశంలో స్ఫూర్తివంతమైన స్పీచ్ ఇచ్చారు.
మైదానంలో అడుగుపెట్టక ముందే వణికించాలి
తమతో ఆడాలంటే ఇతర జట్ల ఆటగాళ్లు భయపడుతున్నాయని సన్‍రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నారు. దూకుడే తమ మంత్రమని, దానిని అలానే కొనసాగిస్తూ.. ప్రత్యర్థి జట్లు మైదానంలో అడుగుపెట్టక ముందే మానసికంగా ఓడించాలని కమిన్స్ వెల్లడించాడు. దూకుడు మంత్రం ప్రతీ మ్యాచ్‍లో పని చేయకపోవచ్చని.. అయినప్పటికీ దానిని కొనసాగించాలని సహచరులకు హితబోధన చేశాడు.
"ఇలానే (దూకుడు) ఆడాలని నేను చెబుతూనే ఉంటాను.. మా నుంచి మీరు వింటూనే ఉన్నారు. ఇది ప్రతి మ్యాచ్‍లో పని చేయదు. కానీ నేను మీకు ఒక్కటి చెప్పగలను. ధైర్యంగా, దూకుడుగా ఉండండి.. ఆటను స్వేచ్ఛతో ఆస్వాదించండి. మీరు బ్యాట్‌తో రాణిస్తూ ఉండండి. మనతో ఆడాలంటే ఇతర జట్లు భయపడుతున్నాయి. మైదానంలోకి రాక ముందే మనం కొన్ని జట్లను పూర్తిగా ఓడించేయాలి. మనకు ఇది మరో గొప్ప రోజు. బాగా ఆడారు.." అని కమిన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు.
Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅
— SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024
Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B
4 విజయాలు.. నాల్గవ స్థానం
ఈ సీజన్‍లో ఇప్పటివరకూ 6 మ్యాచ్‍లు ఆడిన సన్‍రైజర్స్ నాలుగింట విజయం సాధించింది. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 20న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.