SRH vs RR: ఫేవరేట్‌గా రాజస్థాన్.. కమ్మిన్స్ సెంటి‌మెంట్ వర్కౌట్ అవుతుందా..?

SRH vs RR: ఫేవరేట్‌గా రాజస్థాన్.. కమ్మిన్స్ సెంటి‌మెంట్ వర్కౌట్ అవుతుందా..?

ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు రెండు సార్లు టైటిల్ గెలిచింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరపున గిల్ క్రిస్ట్ సారధ్యంలో.. 2016 సీజన్ లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ట్రోఫీని ముద్దాడింది. మన తెలుగు జట్టుకు ట్రోఫీ సాధించిన ఈ రెండు సార్లు కెప్టెన్ గా ఆసీస్ ఆటగాళ్లే కావడం విశేషం. తాజాగా తెలుగు అభిమానులు ఇదే సెంటి మెంట్ ను నమ్ముకొని ఉన్నారు. ఆస్ట్రేలియా వన్డే, టీ20 జట్టు కెప్టెన్ కమ్మిన్స్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు. 

సన్ రైజర్స్ ప్రస్తుతం ఐపీఎల్ టైటిల్ గెలవడానికి రెండు అడుగుల దూరంలో ఉంది. ఇందులో భాగంగా శుక్రవారం (మే 24) రాజస్థాన్ రాయల్స్ తో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. చెన్నైలోని చెపాక్ మైదానం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టుతో పోలిస్తే రాజస్థాన్ జట్టు బలంగా కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్.. ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే హైదరాబాద్ మాత్రం కెప్టెన్ కమ్మిన్స్ పై నమ్మకం పెట్టుకున్నారు. కీలక మ్యాచ్ ల్లో ఈ ఆసీస్ కెప్టెన్ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. 

అంతర్జాతీయ జట్టును విజయవంతంగా నడిపిన కమ్మిన్స్..సన్ రైజర్స్ ను ఫైనల్ కు చేరుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ టోర్నీ మధ్యలో సన్ రైజర్స్ ఈ సీజన్ లో టైటిల్ గెలుస్తుందని చెప్పిన వ్యాఖ్యలతో టైటిల్ వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కమ్మిన్స్ చెబితే ఖచ్చితంగా జరుగుతుందనే సెంటి మెంట్ తెలుగు ప్రజలకు హృదయాల్లో నాటుకుపోయింది.                       

భారత భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కమిన్స్ స్టేట్ మెంట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. సొంతగడ్డపై అభిమానులను సైలెన్స్ గా ఉంచడం కంటే ఆనందం ఏముంటుంది అని ఫైనల్ కు కమ్మిన్స్ అన్నాడు. గెలవడంలో మజా ఉంటే ఛాలెంజ్ చేసి గెలిస్తే ఆ కిక్ వేరే లెవల్ ఉంటుంది. కమ్మిన్స్ కూడా ఇదే చేసి చూపించాడు.

అహ్మదాబాద్ లో జరిగిన ఈ ఫైనల్లో టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ఎదురు చూసిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. 6 వికెట్ల తేడాతో గెలిచి ఆసీస్ విశ్వ విజేతగా అవతరించింది. అగ్రెస్సివ్ గా ఆడతామంటూ చెప్పి మాట నిలబెట్టుకున్నాడు. ఇక చివరగా కమ్మిన్స్ చెప్పిన మాటల్లో కప్ కొడతామనే మాట మాత్రమే మిగిలి ఉంది. మరి తన కెప్టెన్సీతో.. తన లక్కీ చార్మ్ తో హైదరాబాద్ ను ఫైనల్ కు చేరుస్తాడో లేదో చూడాలి.