ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్ ను సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. వరుసగా నాలుగు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలు ఓడిపోయిన కంగారూల జట్టు ఈ సారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమయ్యేందుకు క్రికెట్‌కు ఎనిమిది వారాల విరామం తీసుకున్నాడు. కమిన్స్ ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో ఆడాడు.
సంవత్సర కాలంగా కమ్మిన్స్ బిజీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు.. వన్డే వరల్డ్ కప్ అందించాడు. కెప్టెన్ గా ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టును.. మేజర్ లీగ్ క్రికెట్ లో సాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ క్రికెట్ ను ఫైనల్ కు చేర్చాడు. సెలెక్టర్లు అతని పనిభారాన్నితగ్గించటానికి ఇంగ్లాండ్, స్కాట్లాండ్ సిరీస్ లకు రెస్ట్ ఇచ్చారు. ఆస్ట్రేలియాలో అత్యంత ప్రాముఖ్యమైన షెఫీల్డ్ షీల్డ్ సీజన్ ఆడతాడనే వార్తలు వచ్చినా అతనికి రెస్ట్ ఇవ్వడమే ఉత్తమం అని సెలక్టర్లు భావించారు.
"విరామం మనల్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. భారత్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుండి నేను నాన్‌స్టాప్‌గా బౌలింగ్ చేస్తున్నాను. ఈ విరామం నేను కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. విరామం తర్వాత ఎటువంటి గాయం లేకుండా సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ చేయగలను". అని కమ్మిన్స్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ స్వదేశంలో ఇప్పటివరకు అందుకోలేదని ఈ సారి ఈ ట్రోఫీ అందుకోవడమే తన లక్ష్యమని కమ్మిన్స్ అన్నాడు.