Pat Cummins: ఛాంపియన్స్ ట్రోఫీకి కమ్మిన్స్ దూరం.. ఆ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ

Pat Cummins: ఛాంపియన్స్ ట్రోఫీకి కమ్మిన్స్ దూరం.. ఆ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా కెప్టెన్, ప్రధాన ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. కమ్మిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి ఫిట్‌గా ఉండే అవకాశం లేదని ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కమ్మిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ లలో ఒకరు ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం ఉందని ప్రధాన కోచ్ తెలిపారు. కమ్మిన్స్ తో పాటు మరో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉంది. 

హేజల్ వుడ్ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. మరో రెండు వారాల్లో అతను పూర్తి ఫిట్ నెస్ సాధించడం కష్టంగానే కనిపిస్తుంది. దీంతో ఇద్దరు ఫాస్ట్ బౌలర్ల సేవలను కోల్పోవడం ఆసీస్ కు పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పటికే ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. రెండవ బిడ్డకు కమ్మిన్స్ భార్య జన్మనివ్వడం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్ కు ఈ ఆసీస్ కెప్టెన్ దూరమయ్యాడు. కమ్మిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేస్తున్నాడు.

భారత్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో కమ్మిన్స్ కు చీలమండ గాయం అయింది. ఈ సిరీస్ లో కమ్మిన్స్ 167 ఓవర్లు బౌలింగ్ వేశాడు. గాయం తర్వాత అతను ఇప్పటికీ ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మందితో కూడిన తుది జట్లలో మార్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. మార్ష్, కమ్మిన్స్, హేజల్ వుడ్ స్థానాల్లో మిచ్ ఓవెన్, సీన్ అబాట్, స్పెన్సర్ జాన్సన్ ఆసీస్ జట్టులో ఎంపికయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22 న ఇంగ్లాండ్‌తో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా ఇదే గ్రూప్ లో ఉన్నాయి.