KKR vs SRH: విమర్శలు ఎదుర్కొన్న వారే ఫైనల్‌కు చేర్చారు.. 20 కోట్ల వీరుల మధ్య టైటిల్ ఫైట్

ఐపీఎల్ లో ప్రారంభానికి ముందు అందరి దృష్టి ఆసీస్ ప్లేయర్స్ ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ పైనే ఉన్న మాట నిజం. వేలంలో వీరికి రూ. 20 కోట్లకు పైగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు చెల్లించారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించారు. ఆసీస్ లెఫ్టార్మ్ పేస‌ర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(కేకేఆర్) యాజమాన్యం రూ.24.75 కోట్లు వెచ్చించి అతన్ని చేజిక్కించుకుంది.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డ్ ధరకు అమ్ముడయ్యాడు. కనీస ధర రూ. 2 కోట్లతో ఈ ఆసీస్ కెప్టెన్ వేలం ప్రారంభం కాగా..సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లు వెచ్చించి అతన్ని దక్కించుకుంది. దీంతో వీరిద్దరికి ఇంత భారీ మొత్తంలో చెల్లించడంతో వీరు ఈ ధరకు న్యాయం చేయలేరనే విమర్శలు వచ్చాయి. ఆసీస్ ప్లేయర్లను గుడ్డిగా నమ్మారని మండిపడ్డారు. అయితే వీరు తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. తమ జట్ల తరపున అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్ కు తీసుకెళ్లారు.    

సన్ రైజర్స్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్ జట్టును ముందుండి నడిపించాడు. తన కెప్టెన్సీతో పాటు బౌలింగ్ లోనూ ఆకట్టుకొని జట్టును ఫైనల్ కు చేర్చాడు. ఒకరకంగా సన్ రైజర్స్ ఫైనల్ కు వచ్చిందంటే అందుకు కమ్మిన్స్ కారణమనే చెప్పాలి. అతను రావడంతో జట్టులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆసీస్ జట్టును నడిపించినట్టే ఐపీఎల్ లో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి తన ధరకు న్యాయం చేశాడు. టోర్నీలో 15 మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీయడమే కాదు బ్యాటింగ్ లోనూ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. 

మరోవైపు స్టార్క్ టోర్నీ ప్రారంభంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఒక సాధారణ బౌలర్ కంటే ఘోరంగా బౌలింగ్ చేశాడు. అయితే కొన్ని మ్యాచ్ ల నుండి అతని ప్రదర్శన అద్బుతమనే చెప్పాలి. ముఖ్యంగా క్వాలిఫయర్ 1 లో టాప్ బౌలింగ్ తో అదరగొట్టాడు. హెడ్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ లాంటి కీలక వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కోట్లు కుమ్మరించి కొన్న వీరిద్దరూ ఫైనల్లో అదే ఫామ్ ను కొనసాగించి తమ జట్టుకు ట్రోఫీ అందిస్తారో లేదో చూడాలి.