సిడ్నీ: చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. చీలమండ గాయంతో ఇబ్బందిపడుతున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే వారం స్కానింగ్‌కు వెళ్లనున్నాడు. ఇందులో గాయం తీవ్రమైందిగా తేలితే అతను చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండటం కష్టమే. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ నిరాకరించారు.
‘కమిన్స్ విషయంపై సందిగ్ధత ఉంది. స్కానింగ్ తర్వాత వచ్చే నివేదికను బట్టి నిర్ణయం ఉంటుంది. గాయం తీవ్రత ఎలా ఉందనేది అంచనా వేయాలి. ఒకవేళ తీవ్రంగా ఉందని తేలితే కచ్చితంగా విశ్రాంతి ఇవ్వాల్సిందే. ఏదేమైనా ఇప్పుడే దీనిపై మాట్లాడటం సరైంది కాదు’ అని బెయిలీ వ్యాఖ్యానించారు.
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్‌లకు కూడా కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ కమిన్స్ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే హాజిల్‌వుడ్‌ను తీసుకునే చాన్స్ ఉంది.